తెలంగాణ చరిత్ర మహోన్నతం

– ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ చరిత్ర మహోన్నతమైనదని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చరిత్రకారులు అడపా సత్యనారాయణ, ద్యావనపల్లి సత్యనారాయణ రచించిన ‘తెలంగాణ చరిత్ర’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఆది నుంచి మత సామరస్యం, మానవీయ విలువలకు కేంద్రంగా నిలిచిందని చెప్పారు. భారతదేశ చరిత్ర పటంలో తెలంగాణ చరిత్ర అజరామరమైందని అన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత చరిత్రను వెలికితీసే కృషి ముమ్మరంగా కొనసాగుతున్నదని వివరించారు. తెలంగాణ చరిత్ర, కళలు, సాహిత్యం, ఈ నేలపై ఎగిసిన విప్లవాలు, ఉద్యమాల సమగ్ర చరిత్ర అవగాహన చేసుకుంటేనే భవిష్యత్‌ పునర్నిర్మాణం శక్తివంతంగా ఉంటుందన్నారు. ప్రధానంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఈ గ్రంథం ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని తర్వాత తరాలకు అందజేయాలంటే చరిత్ర, సంస్కృతిని నిక్షిప్తం చేసి అందచేయాల్సిన అవసరముందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) ఉపకులపతి డి రవీందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ మొదట దీన్ని ఆంగ్లంలో, ఇప్పుడు తెలుగులో అందించటం వల్ల చరిత్ర విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్‌ జూలూరు గౌరీ శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఎంతో సాహిత్యం వెలువడుతున్నప్పటికీ చరిత్ర, సంస్కృతి, ఉద్యమాల విషయంలో ఇది ఒక అద్భుతమైన గ్రంథమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కే మహమూద్‌, ప్రొఫెసర్‌ రమణ నాయక్‌, తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ చైర్మెన్‌ తన్నీరు వెంకటేశం, పుస్తక రచయితలు అడపా సత్యనారాయణ, ద్యావనపల్లి సత్యనారాయణ, పబ్లిషర్‌ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.