– 94 పనిదినాల్లో కోటి 60 లక్షల 89 వేల 744 మందికి కంటి పరీక్షలు: సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం కేసీఆర్ అలోచనతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం వంద రోజులకు చేరువవుతున్నది. 94 పని దినాల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల 89 వేల 744 మందికి కంటి పరీక్షలు చేశారు. ఈ మేరకు శనివారం సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 22 లక్షల 44 వేల 267 మందికి ఉచితంగా కండ్లద్దాలు, ఔషధాలు అందజేశారు. 15 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశారు. పరీక్షలు చేసిన వారిలో 75 లక్షల 62 వేల 259 మంది పురుషులు, 85 లక్షల 6 వేల 175 మంది స్త్రీలు, 11,584 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. కోటి 20 లక్షల 42 వేల 218 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారించారు. మొదటి దఫా కంటి వెలుగు కార్యక్రమంలో కోటి 50 లక్షల మందికి పరీక్షలు చేయగా ఈసారి 94 పని దినాల్లో 10 లక్షలకు పైగా అదనంగా నిర్వహించడం జరిగింది. 12,501 గ్రామపంచాయతీల్లో, 3,666 మున్సిపల్ వార్డులలో కంటి పరీక్షలు పూర్తి కాగా, మొత్తంగా ఇప్పటికే 15 జిల్లాల్లో స్క్రీనింగ్ పూర్తయింది.
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యం : మంత్రి హరీశ్ రావు
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో పరీక్షలు ఎక్కువగా చేయాలని సూచించారు. అందుకోసం ప్రచారం కల్పించి ప్రజలకు అవగాహన పెంచాలని ఆదేశించారు. కంటి వెలుగు విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న ఇతర శాఖలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.