– పది రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి…
– లేకుంటే కమిషనర్ కార్యాలయం ఎదుట వంటా-వార్పు
– తక్షణం ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి
– చలో లేబర్ కమిషనరేట్ ఆందోళనలో జేఏసీ నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కార్మికుల పక్షాన నిలవాల్సిన కార్మికశాఖ యాజమాన్యం కొమ్ముకాస్తూ, కోర్టు ఉత్తర్వుల్ని కూడా అమలు చేయట్లేదని టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు విమర్శించారు. పదిరోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలనీ, లేనిపక్షంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున వంటా-వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ‘చలో కార్మిక శాఖ కమిషనరేట్’ అంటూ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారంనాడిక్కడ అందోళనా కార్యక్రమం జరిగింది. జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కో కన్వీనర్ కే యాదయ్య, కమిటీ సభ్యులు జీఆర్ రెడ్డి, కృష్ణ, ప్రకాశ్ తదితరులు మాట్లాడారు. ఆర్టీసీలో మూడున్నరేండ్లుగా కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించడం లేదనీ, గుర్తింపు సంఘం కమిటీల స్థానంలో ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశారని తెలిపారు. సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా, యాజమాన్యం, కార్మిక శాఖ పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ఆర్టీసీలో రోజురోజుకూ కార్మికుల సంఖ్య తగ్గిపోతున్నదనీ, కొత్త నియామకాలు చేపట్టకుండా ఉన్నవారిపై పనిభారాలు మోపుతున్నారని చెప్పారు. 8 గంటల పని స్థానంలో 12 నుంచి 16 గంటలు పనిచేయిస్తున్నా రన్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల లోపు దిగేలా డ్యూటీలు వేయడం లేదనీ, కార్మికులపై ఒత్తిడి, వేధింపులు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, టెర్మినల్ బెనిఫిట్స్ కూడా సకాలంలో చెల్లించట్లేదని తెలిపారు. అనంతరం లేబర్ కమిషనర్ అహ్మద్ నదీమ్‌కు జేఏసీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ యాజమా న్యంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు ఎన్ జక్రయ్య, బీ జ్యోతి, బీ పాపయ్య గౌడ్, సీహెచ్ బాపురెడ్డి శరణప్ప, శారద, కల్పన, శమంత తదితరులు పాల్గొన్నారు.