– రూ.24వేల వేతనం ఇవ్వాలి :సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్
– జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా
నవతెలంగాణ-హిమాయత్ నగర్
జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల కనీస వేతనం రూ.24 వేలకు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ), గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. 25 ఏండ్లుగా గ్రేటర్ హైదరాబాద్‌లో పారిశుధ్య నిర్వహణలో జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు కార్మికులు సమర్థవంతంగా పని చేస్తున్నారని, వారికి వేతనాలు పెరిగి చాలా కాలం అవుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలు, అధిక భారం వల్ల కనీస వేతనాలను రూ.24 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని తెలిపారు. జాతీయ, సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల సంస్థలకు అమ్ముతున్నదని, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను పార్లమెంట్‌లో ఆమోదించుకుందని, బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వే, రక్షణ, సింగరేణి తదితర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి బలోపేతం చేయకుండా అన్యాయం చేస్తోందన్నారు.తెలంగాణ జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షులు జె.వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో పారిశుధ్య నిర్వహణలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులుగా సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. వారు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య సేవల్లో ప్రయివేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించాలని, రాంకీ తదితర ప్రయివేటు కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ హాజర్ పట్టీలో అవకతవకలను అరికట్టాలని, 2022 మే, జూన్ నెలల బకాయిలను చెల్లించాలని కోరారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి, ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రెబ్బా రామారావు, ఉపాధ్యక్షులు నర్సయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అంజాద్, యూనియన్ నేతలు ఇ.అంజయ్య, కె.సూర్య ప్రకాష్, ఎం.శ్రావణ్ కుమార్, సి.మల్లేష్, ఉన్ని కృష్ణన్, కిషన్, ఆర్.వాణి, వి.వి మంగపతి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.