– బస్టాండ్ బతుకును బాగు చేసేది ఎవరు
– రూ.41 లక్షల అభివృద్ధి పనులు ఇంకెప్పుడు ప్రారంభిస్తారు
– బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్
నవతెలంగాణ-పాల్వంచ
నవ్వి పోతారు గాక నాకేంటి సిగ్గు అనే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ తీరు ఉందని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. ఆదివారం ఆయన పాల్వంచ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాల్వంచ బస్టాండ్‌ను సందర్శించి మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 5న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా రూ 41 లక్షలతో పాల్వంచ బస్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని అన్నారు. శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు గడిచిన నేటికి పనులు ప్రారంభించకపోకపోవడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ జాప్యం వల్ల వచ్చే వర్షాకాలంలో సైతం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ఇంకా ఈ పనులకు ఎప్పుడు మోక్షం లభిస్తుందని అయినా సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి అంటే కేవలం శిలాఫలకాలను చూస్తూ మురిసిపోతే సరిపోదని, పనులు కూడా జరగాలన్నారు. పాల్వంచ ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్న ఒక బస్టాండును సైతం రవాణా శాఖ మంత్రిగా, జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పువ్వాడ కానీ, స్థానిక ఎమ్మెల్యే వనమా గాని ఇవ్వలేకపోయారని ఇది ఏమి దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం 41 లక్షల మరమత్తు పనులకే దిక్కు దివానం లేకుండా పోయిందని, ఇది ఎంతవరకు సమంజసమన్నారు. స్థానిక ఎమ్మెల్యే వనమా ఉండే పాల్వంచ పట్టణంలోనే అభివృద్ధి దారుణంగా ఉందని, పాల్వంచ బస్టాండ్‌లో ఉన్న సమస్యలపై తాను అనేకమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళనాని చెప్పారు. పాల్వంచ బస్టాండులో నీళ్లు నిలిచి ఉండడాన్ని చూసి మొక్కలు నాటిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి పాల్వంచ బస్టాండ్ మరమ్మత్తుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని లేనిపక్షంలో పాల్వంచ పట్టణ ప్రజలను మమేకం చేస్తూ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయి, కేతిని కుమారి, ఏడెల్లి మర్థమ్మ, ఎర్రంశెట్టి రాజేశ్వరి, మంజు, గుంజ సరోజ తదితరులు పాల్గొన్నారు.