అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

The problems of Anganwadi employees should be resolved– లేందంటే సెప్టెంబర్‌ 11నుంచి నిరవధిక సమ్మె
– తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్స్‌
– జేఏసీ (సీఐటీయూ, ఏఐటీయూసీ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలనీ, లేదంటే సెప్టెంబర్‌ 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నామని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్స్‌ జెఏసీ (సీఐటీయూ, ఏఐటీయూసీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కె సునీత, పి జయలక్ష్మి, పి మంగ, ఎం సాయీశ్వరి, ఎన్‌ కరుణ కుమారి,సీహెచ్‌ సీతామహాలక్ష్మి బృందం స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కమీషనర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ”రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్‌వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా మహిళలు. బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. గత 45 ఏండ్లకు పైగా ఐసీడీఎస్‌లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించలేదు. దీంతో అంగన్‌వాడీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆరోగ్య కార్డులు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాం తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌, పండగ బోనస్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. స్వయంగా సీఎం అంగన్‌వాడీ వర్కర్‌ పేరును టీచర్స్‌ గా మార్చారు. కానీ టీచర్లతో సమానంగా చేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు”అని తెలిపారు. పలు సార్లు అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పలు సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తగిన రీతిలో ప్రభుత్వం స్పందించటం లేదని తెలిపారు. ఇప్పటికైనా పరిష్కరించాలని లేదంటే నిరవధిక సమ్మె అనివార్యమని తెలిపారు.