– లేనిపక్షంలో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తాం
– తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్ల సంఘాల జేఏసీ హెచ్చరిక
– ఆర్టీఏ కమిషనర్ ఆఫీస్ ముట్టడి
– ఆఫీస్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన డ్రైవర్లు
– అడ్డుకుని ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్
వందశాతం పెరిగిన ఇంధన ధరలు, ఆదాయం పతనంతో రవాణారంగం కార్మికులు అనేక సమస్య లు ఎదుర్కొంటున్నారని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఆటో రిక్షా అండ్ క్యాబ్ డ్రైవర్ల సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతంలో అనేకసార్లు విజ్ఞాపనలు, ధర్నాలు, పోరాటా లు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లు సమస్యలు పరిష్కరించాలంది. లేనిపక్షంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించింది.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర ఆటో రిక్షా అండ్ క్యాబ్ డ్రైవర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లు ముట్టడించారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కమిషనరేట్ లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డ్రైవర్లకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో నిరసనకారులు రహదారిపై బైటాయించగా పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు బి.వెంకటేశం (ఏఐటీయూసీ), వి. మారయ్య (బీఆర్‌టీయూ), శ్రీకాంత్(సీఐటీయూ), ఏ.సత్తిరెడ్డి (టిఏడిఎస్), కిరణ్ (ఐఎఫ్‌టీయూ), షేక్ సలావుద్దీన్, సతీష్, నగేష్(క్యాబ్స్ యూనియన్) మాట్లాడారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్లు పేదరికంలో జీవిస్తున్నారని, 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీలు పెంచకపోవడం దారుణమని అన్నారు. నిత్యావసర వస్తువులతోపాటు, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు వంద శాతం పెరగడంతో రవా ణారంగ కార్మికులు దయనీయ పరిస్థితులను ఎదు ర్కొంటున్నారని తెలిపారు. అసంఘటిత రంగంలోని ఆటో కార్మికులు కార్మిక చట్టాల పరిధిలో లేరని, వారికి ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటివి లేవని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనాలూ పొందడం లేదని తెలిపారు. ఆటో కార్మికుల మనో వేదనలను ప్రభుత్వం అర్థం చేసుకొని, తక్షణమే ఆటో మీటర్ చార్జీలు పెంచి, కార్మికుల సంక్షేమానికి రవాణారంగ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త ఆటో పర్మిట్ల జారీ నిషేధం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకకుండా పోతుందని, నిషేధం ఎత్తివేసి 25 వేల కొత్త ఆటో పర్మిట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్‌లు, నూతన మోటర్ వాహన చట్టాన్ని రద్దు చేయాలని, పెట్రోల్, డీజీల్, ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రపై ఒత్తిడి తేవాలని కోరారు.
ఆటోరంగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ముట్టడిలో ఏఐఆర్‌టీడబ్లూఎఫ్-సీఐటీయూ నగర కార్యదర్శి అజరు బాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి, ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ నేతలు కొంరెల్లి బాబు, సీహెచ్. జంగయ్య, ఎండీ. ఒమర్ ఖాన్, ఎస్.కే. లతీఫ్, కృష్ణమూర్తి, ఐఎఫ్‌టీ యూ ప్రవీణ్, బీఆర్‌టీయూ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.