కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

–  సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
నవతెలంగాణ – ధూల్‌పేట్‌
ల్యాబ్స్‌, పబ్లిక్‌ సెక్టార్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ డిమాండ్‌ చేశారు. కనీస వేతనాల క్యాంపెయిన్‌లో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపుజాత గురువారం హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ పరిశ్రమకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నదన్నారు. వారికి చట్టపరంగా వచ్చే హక్కులు మాత్రం కాంట్రాక్టర్లు, మేనేజ్‌మెంట్‌ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. రక్షణ పరికరాలు, నాణ్యమైన యూనిఫామ్‌, 30 రోజుల వేతనంతో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిటైర్‌ అయిన కార్మికులకు కచ్చితంగా గ్రాట్యూటీ అమలు చేయాలని, పీఎఫ్‌ ఈఎస్‌ఐ, సెలవులు, బోనస్‌ సక్రమంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని, లేని పక్షాన కార్మికులతో కలిసి పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ కన్వీనర్‌ ఎస్‌ కిషన్‌, సత్తన్న బాబురావు, శంకరన్న, మీన, గౌస్‌, స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.