– టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల గాలయ్య
– అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్షలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల గాలయ్య డిమాండ ్‌చేశారు. టీఎస్‌యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు టీచింగ్‌తో పాటు ఇతర బాధ్యతలు ఎక్కువగా నిర్వహించడం వల్ల పని ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు తమ సమస్యలను గొంతెత్తి బయటకి చెప్పడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితులు గురుకుల సొసైటీలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉపాధ్యాయ విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అన్ని సొసైటీల్లో ఒకే విధమైన పరిపాలన అమలు చేయాలన్నారు. టీఎస్‌ఆర్‌ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ విద్యాసంస్థల్లో బోధన సమయాన్ని ఇతర సొసైటీలో మాదిరిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉండే విధంగా మార్చాలన్నారు. పివో 2018కు అనుగుణంగా చేసిన రీ అలైన్మెంట్‌పై ఉపాధ్యాయుల గ్రీవెన్సెస్ అన్నింటిని సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. కోర్టు వివాదాలు సత్వరమే పరిష్కరించాలన్నారు. అన్ని గురుకులాల్లో బదిలీలు, పదోన్నతల కౌన్సిలింగ్ షెడ్యూలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని సొసైటీలో ప్రిన్సిపాల్ 100శాతం, జేఎల్ పిజిటి పోస్టుల్లో 70శాతం ఇన్ సర్వీసు పదోన్నతుల కోటగా నిర్ణయించాలన్నారు. అన్ని సొసైటీల్లో నెల మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలన్నారు. గురుకుల ఉపాధ్యాయులపై పని భారం, మానసిక ఒత్తిడి తగ్గించాలన్నారు. హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం, మెడికల్ రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలన్నారు. కేర్ టేకర్ డిప్యూటీ వార్డులను ప్రత్యేకంగా నియమించాలని కోరారు. సొసైటీ మారిన ప్రభుత్వ సర్వీసు నుండి సొసైటీకి వచ్చిన ఉపాధ్యాయులకు పే ప్రొటెక్షన్ వర్తింపజేయాలన్నారు. సీఆర్టీల సర్వీసులు రెగ్యులరీ చేయాలన్నారు. కాంట్రాక్టు, గెస్ట్, పార్ట్ టైం, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు బేసిక్ పే, 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటప్ప, జిల్లా ఉపాధ్యక్షులు బి రాములయ్య, న్. కల్పన, జిల్లా కోశాధికారి డాక్టర్ జగన్నాథం, జిల్లా కార్యదర్శులు ఏ నాగేంద్రం, జి భగవంత రాజ్, బి భువనేశ్వరి, సుగంధ, మహిపాల్, మాజీద్, అజమత్ ఖాన్, కిరణ్ కుమార్, పి. అంజయ్య, బి. యాదగిరి, చంద్రయ్య, రామకృష్ణ, సైదులు, గోవర్ధన్ రెడ్డి, సంగీత, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.