గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

The problems of gurukula teachers should be solved–  సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. కేజీ టు పీజీ విద్యా పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 700లకుపైగా గురుకులాలను ప్రారంభించారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం డిగ్రీ కళాశాలలతో కలిపి 1,002 గురుకుల విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు. ఒక్కో సొసైటీలో ఒక్కో రకంగా పరిపాలన, అజమాయిషీ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. బోధనా సమయాల్లో సైతం ఏకరూపత లేదని తెలిపారు. కొత్త విద్యా సంస్థలన్నీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్‌ టీచర్లతోపాటు, సమాన సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గెస్ట్‌, పార్ట్‌టైం టీచర్లు పనిచేస్తున్నారని వివరించారు. వారికి కనీస వేతనాల్లేవని తెలిపారు. 2018, 2019 సంవత్సరాల్లో నియామకమైన రెగ్యులర్‌ టీచర్ల సర్వీస్‌ను రెగ్యులరైజేషన్‌ పూర్తిచేయడంలో, పదోన్నతులు ఇవ్వడంలో ఒక్కో సొసైటీ ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈ సంస్థలన్నీ నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మంచి విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు పాఠ్యబోధనే కాకుండా హౌజ్‌ మాస్టర్‌, కేర్‌టేకర్‌, డిప్యూటీ వార్డెన్‌, సూజర్‌వైజరీ స్టడీస్‌, నైట్‌ స్టే విధులను నిర్వహిస్తున్నారనీ, సెలవుల్లేకుండా పనిచేస్తూ శారీరక శ్రమతోపాటు, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వివరించారు. నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా తీవ్రమైన చర్యలుంటున్నాయని తెలిపారు. అయినా వారికి శ్రమకు తగిన వేతనం, గుర్తింపు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనేక రకాలుగా నిరసనలు
తెలియజేశారని గుర్తు చేశారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈనెల ఐదున హైదరాబాద్‌లో జరిగిన మహాధర్నాకు తాను హాజరై వారి సమస్యలను తెలుకున్నానని తెలిపారు. ఆ సమస్యలన్నీ న్యాయమైనవేననీ, కాబట్టి సీఎం కేసీఆర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని వారి కోర్కెలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.