మిగిలిన కాంట్రాక్టు

The rest of the contract– అధ్యాపకులనూ క్రమబద్ధీకరించండి
–  మంత్రి సబితకు టీజీజేఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ఇంకా మిగిలిపోయిన కాంట్రాక్టు అధ్యాపకులనూ క్రమబద్ధీకరించాలని తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ (టీజీజేఎల్‌ఏ-475) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వస్కుల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ గురించి శాసనమండలిలో సానుకూలంగా మాట్లాడినందుకు మంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ త్వరగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్టు అధ్యాపకులుగా కొనసాగుతూ అర్ధాంతరంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీజేఎల్‌ఏ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, పోల్కంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, తిరుపతిరెడ్డి, మనోహర్‌, రజిత తదితరులు పాల్గొన్నారు.