ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనది

– అయితే అది ప్రాథమిక హక్కు కాదు..చట్టబద్ధమైన హక్కు
– బీఆర్‌ఎస్‌ ఎంపీ బిబి పాటిల్‌ కేసులో సుప్రీం తీర్పు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైదని, అయితే అది ప్రాథమిక హక్కు కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిబి పాటిల్‌పై 6,299 ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి కె. మదన్‌ మోహన్‌రావు ఎన్నికల అఫిడవిట్‌లో బిబి పాటిల్‌ తప్పుడు సమాచారాన్ని పేర్కొంటూ నిబంధలను ఉల్లంఘించారని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేయడాన్ని సమర్థిస్తూ ఈ తీర్పు వెలువడింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌. రవీంద్ర భట్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం అభ్యర్థి వివరణాత్మక నేపథ్యాన్ని తెలుసుకునే ఎన్నికల హక్కు రాజ్యాంగ న్యాయశాస్త్రంలో భాగమని నొక్కి చెప్పింది. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ముఖ్యమైన అంశం అయినప్పటికీ, ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించకపోవడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ”ప్రజాస్వామ్యం సారాంశంలో ఓటు హక్కు చాలా ముఖ్యమైనది. ఈ హక్కు అమూల్యమైనది. స్వాతంత్య్రం కోసం జరిగిన సుదీర్ఘమైన, కఠినమైన పోరాటం ఫలితంగా ఇది ఉంది. ఇక్కడ పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునే హక్కును కలిగి ఉంటాడు. అయితే ఓటు హక్కును వినియోగించుకోవడమనేది ప్రాథమిక హక్కు కాదు. ఇది కేవలం చట్టబద్ధమైన హక్కుగా ఉంది” అని ధర్మాసనం పేర్కొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి కె. మదన్‌ మోహన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు 2022 జూన్‌ 15న రోజూవారీ విచారణ చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బిబి పాటిల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలిపివేసింది. అయితే ఈ అంశాన్ని మళ్లీ నిర్ణయించాలని హైకోర్టుకు సూచించింది. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ఆర్డర్‌ 7 రూల్‌ 11 ప్రకారం అధికారాల వినియోగంలో పిటిషన్‌ను పాక్షికంగా తిరస్కరించడం సాధ్యం కాదని ధర్మాసనం పునరుద్ఘాటించింది. బిబి పాటిల్‌ తరపున సీనియర్‌ న్యాయవాదులు సి ఆర్యమ సుందరం, హరీన్‌ పి రావల్‌ తదితరులు వాదనలు వినిపించారు. కాంగ్రెస్‌ నేత కె.మదన్‌ మోహన్‌ రావు తరపున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, సల్మాన్‌ ఖుర్షీద్‌ తదితరులు వాదించారు.