మట్టిలో మాణిక్యం డాక్టర్‌ మానస…

నెరవేరిన కళ
– పట్టుదలతో ఉన్నత స్థాయికి
– నవతెలంగాణ కధనాలు, కోర్టు ఆదేశాలతో కోల్పోయిన ఎంబిబిఎస్‌ సీటు సాధించిన ఘతన
– నేడు సులానగర్‌ వైద్యశాలలో డాక్టరమ్మగా విధుల్లో
– సంతోషంలో కుటుంబం, అభినందిస్తున్న ప్రజలు
చదవాలనే పట్టుదల ఉండాలేకాని పేదరికానికి చదువు అడ్డుకాదు. పట్టుదల ఉంటే సాధించలేనిదేమి లేదు. మనిషి జీవితంలో ఓదార్పు పట్టుదల గెలుపుకు సోపానాలని నిరూపించింది డాక్టర్‌ మానస. పేదరికంలో ఆర్దికంగా ఇబ్బందులు పడుతూనే ఎంసెట్‌ రాసి ప్రభుత్వ వైద్యకళాశాలలో సీటు పొందింది. అంగాహనా లోపంతో సీటు కోల్పోయింది. ఎంతో కష్టపడి చదివి ఎంబిబిఎస్‌ సీటు కోల్పోయినప్పటికీ ప్రధానంగా నవతెలంగాణ దినపత్రిక కధనాలు, ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా సహకారం, హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ ఎంబిబిఎస్‌ సీటు సాధించి కోర్సు పూర్తి చేసింది. తాజాగా టేకులపల్లి మండలంలోని సులానగర్‌ ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్‌గా ఉద్యోగం పొందింది. అందరికీ స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక కధనం.

నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని అప్పటి హామాలి బస్తీ (నేడు ఆర్‌ఆర్‌ కాలనీ)లో మద్ది జయప్రకాష్‌, కళావతి దంపతులకు నలుగురు సంతానం. ముగుర్గు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. వారంతపు సంతలో కూరగాయలు అమ్మడం, తల్లి కళావతి ఉన్న ఒక్క బర్రె పాలు పిండి వచ్చే డబ్బుతో కుటుంబాన్ని నడిపించేవారు. పేద కుటుంబం. అయినప్పటికీ పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు. పెద్ద కూతురు మద్ది శిరీష కేంద్రీయ విద్యాలయంలో 6 నుండి ఇంటర్‌ వరకు చదివింది. ఇంటర్‌లో జిల్లా స్థాయి ర్యాంకు సాధించింది. ఐఐటి కౌన్సెలింగ్‌కు కొద్ది రోజుల ముందు విధి వక్రీకరించింది. తన స్నేహితురాలి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా పాలేరు సమీపంలోనే బస్సు ఢ కొట్టడంతో మృత్యువాత పడింది. మద్ది మానస రెండవ కూతురు. చురుకుదనం. డాక్టర్‌ కావాలనే చిన్నప్పటి నుండి కోరిక. ప్రయివేటు స్కూల్స్‌లో చదవాలంటే అధిక ఫీజులు. మోయలేని భారం. మంచి ప్రభుత్వ రెసిడెన్సియల్‌ పాఠశాలలో చదివితే డాక్టర్‌ కావచ్చనే ఆలోచన వచ్చింది. దీంతో కేంద్రీయ విద్యాలయం నిర్వహించిన పరీక్ష రాసింది. తన అక్క శిరీష చదివిన ఖమ్మం జిల్లా పాలేరు కేందీయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం పొందింది. ఇంటర్‌లో 86 శాతం మార్కులతో జిల్లా ర్యాంకు సాధించింది. పట్టుదలతో ఎంసెట్‌కు ప్రిపేర్‌ అయ్యింది. 160 మార్కులకు 136 సాధించింది. 1,355 ర్యాంక్‌ వచ్చింది. కల ఫలించి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చింది. సెప్టెంబర్‌ 24న జాయిన్‌ అయ్యింది. కళాశాల ఫీజు 10,500, ట్యూషన్‌ ఫీజు రూ.12,815, హాస్టల్‌ ఫీజు రూ.15,000 కట్టింది. మూడు రోజులు ఓరియంటేషన్‌ క్లాసులకు హాజరయ్యింది. అయితే ఇల్లందు నుంచి మహబూబ్‌నగర్‌ చాలా దూరంలో ఉండటంతో రెండవ కౌన్సిలింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఇంకా దగ్గరలో సీటు వస్తుందని భావించింది. దీంతో రెండవ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లో ఆప్షన్‌లు ఇచ్చుకుంది. ఆదిలాబాద్‌ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చింది. మహబూబ్‌నగర్‌ కన్నా ఆదిలాబాద్‌ ఇంకా దూరంలో ఉండటంతో ఆ సీటు వద్దు అనుకొని మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాలకే వెళ్లింది. ఓరియంటేషన్‌ క్లాస్‌లకు హాజరవుతోంది. ఇలా ఉండగా మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాల విద్యార్థిని తండ్రి జయప్రకాష్‌కు ఫోన్‌ వచ్చింది. విద్యార్థుల ఫైనల్‌ లిస్ట్‌ వచ్చింది. అందులో ‘ మీ అమ్మాయి’ పేరు లేదని, యూనివర్శిటీకి వెళ్లి కనుక్కోండని చెప్పారు. దీంతో జయప్రకాష్‌ హైదరాబాదులోని కాళోజి నారాయణరావు హెల్త్‌ యూనివర్శిటీకి వెళ్లి రిజిస్ట్రార్‌, వైస్‌ ఛాన్సలర్‌లను కలిసి సమస్య వారి దృష్టికి తీసుకెళ్లాడు. ‘మీ అమ్మాయి రెండవ ఆప్షన్‌ పెట్టుకుంది. దీంతో ఆదిలాబాద్‌లో మెడికల్‌ సీటు వచ్చింది. మీకు ఇష్టం లేకపోతే అక్కడికి వెళ్లి రిపోర్టు చేయాల్సింది. చేయలేదు. దీంతో ఆదిలాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాలలోనూ సీటు కూడా కోల్పోయింది. జాబితా కూడా ఎంసీఐకి పంపాం. ఏమి చేయలేం’ అని చెప్పడంతో జయప్రకాష్‌ కన్నీంటిపర్యంతమయ్యాడు.
ప్రభుత్వ నిబంధనలు తెలియక, మెడికల్‌ కళాశాలల తీరుతో ఎంబీబీఎస్‌ విద్యార్థిని తనకు లభించిన సీటు కోల్పోయింది. ప్రధానంగా నవతెలంగాణకు విషయం చెప్పడంతో పలు కథనాలు జిల్లా, మెయిన్‌ పేజీల్లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటుగా పలు పత్రికలు, ఛానళ్ళలో వారం రోజులపాటు మారుమోగింది. మానవతా దృక్పథంతో తనకు వచ్చిన సీటు ఇప్పించాలని స్దానిక అప్పటి ఎంఎల్‌ఏ కోరం కనకయ్య, అధికారులను, జిల్లా కలెక్టర్‌, మంత్రులు, సీఎంను, వేడుకుంది. సీపీఐ(ఎం)తో పాటుగా పలు రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు మానసకు బాసటగా నిలిచి పేద విద్యార్ధినికి మెడికల్‌ సీటు ఇవ్వాలని ప్రభుత్వ దృష్టికి సమస్య తీసుకెళ్ళారు. దీంతో హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అందరి కృషి ఫలిందింది. మద్ది మానసకు కోల్పోయిన మెడికల్‌ సీటు తిరిగి ఇవ్వాల్సిందిగా నాటి ఎంసిఐ(మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా)ను హైకోర్టు ఆదేశించింది. దీంతో నవంబర్‌ 2016లో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాళాలలో ఎంబిబిఎస్‌ సీటు లభించింది. కోర్సు పూర్తి కావడంతో నేడు టేకులపల్లి మండలంలోని సులానగర్‌ ప్రాధమిక వైద్యశాలలో డాక్టర్‌గా ఉద్యోగం పొందింది. అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
కూతురు డాక్టర్‌ కావడం ఆనందకరం : తల్లిదండ్రులు మద్ది జయప్రకాష్‌ కళావతి
మేము ఉన్నత చదువులు చదవలేదు. నా కూతురు డాక్టర్‌ అయ్యిందంటే ఎంతో గర్వంగా ఉంది. పిల్లలు ప్రయోజకులైతే ఎక్కడా లేని ఆనందం. నా జీవితం సార్దకమైంది. తల్లిదండ్రుకులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చిన్నప్పటి నుండి పట్టుదలతో చదివింది. డాక్టర్‌ కవాలనే ఆశయం నెరవేరింది.
పేదలకు సేవ చేస్తా : సహకరించిన అందరికీ కృతజ్ఞతలు… డాక్టర్‌ మద్ది మానస
నా చిన్నప్పటి కల నెరవేరింది. డాక్టర్‌ను కావడానికి తల్లి దడ్రులు, కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. ఎంతో కష్టపడి తల్లిదడ్రులు చదివించారు. కోల్బోయిన ఎంబిబిఎస్‌ సీటు మల్లీ తిరిగి పొందడానికి సహకరించిన మీడియాకు, ఉన్నత న్యాయస్దానానికి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వారి ఆశయాలు నెరవేరుస్తాను. పేదలకు సేవ చేయడమే ధ్యేయం. భవిష్యత్తులో నిరుపేదలకు, రోగులకు సేవ చేయడం, ఆర్దికంగా సహాయసహకారాలు అందిచడానికి పాటుపడతాను.