పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖలో పదోన్నతుల హడావిడి వంద మందికి అవకాశం ?

–  జాబితాల రూపకల్పనకు కసరత్తు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖను భారీగా పునర్వ్యవ్యవస్థీకరించిన నేపథ్యంలో పదోన్నతుల హడావిడి ప్రారంభమైంది. ఈ మేరకు కసరత్తును ఆ శాఖ ఉన్నతాధికారులు చేపట్టారు. ప్రస్తుతం జాబితాలను రూపొందించే పని జరుగుతున్నది. సందట్లో సడేమియలా ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది పైరవీలకు దిగుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల చేత సిఫారుసు లేఖలతో ఉన్నతాధికారుల దగ్గర ప్రత్యక్షమవుతున్నారు. కొందరు ఐఏఎస్‌లతోనూ సంప్రదింపులు చేస్తూ తమకు కావాల్సిన చోటకు వెళ్లేందుకు శక్తివంచలేకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రమోషన్లు సర్వీసు సీనియార్టీ ప్రకారం జరుగుతాయనేది అందరికి తెలిసిందే. అయింతే ఇందులో ఎవరికి అన్యాయం జరగకపోయినా, పోస్టింగ్‌ల కోసం మాత్రమే భారీగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫోన్లు చేయించుకోవడం, ఉత్తరాలు తెచ్చి అధికారులకు ఇస్తుండటంతో పోటీవాతావరణం నెలకొంది. డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ)కి త్వరలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ అర్హులైన అధికారులు, ఇంజినీర్లతో కూడిన జాబితాలు త్వరలో వెళ్లనున్నాయి. ఈ సందర్భంగా ప్రమోషన్లకు అనేక అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో సమయానుకూలంగా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతోపాటు పంచాయతీరాజ్‌ శాఖ నుంచి మిషన్‌ భగీరథకు వెళ్లిన కొంత మంది ఇంజినీర్లకు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సీనియార్టీ సమస్య ముందుకొస్తున్నది. దీంతో ప్రమోషన్లు అంత సులభం కాదనే ప్రచారం అధికారులు, ఇంజినీర్ల మధ్చ చర్చోపచర్చలుగా సాగుతున్నాయి. శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు దాదాపు 87 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో 18ని విడుదల సంగతీ తెలిసిందే. అలాగే ఆయా హోదాల్లో ఉన్న ఇంజినీర్లకు అధికారాల బదలాయింపును సైతం చేసింది. దీనికోసం మరో జీవో నెంబరు 19 జారీ అయింది. దీంతో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ మరింత బలోపేతమయ్యేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర విద్యుత్‌, ఆర్‌ అండ్‌ బీ, సాగునీటి పారుదల శాఖ తరహాలోనే పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖను సైతం బలోపేతల చేయాలని ప్రభుత్వం భావించింది. ఈమేరకు ప్రతిపాదనలను పంపాలని గత ఏడాది నవంబరులో ఆ శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆ శాఖలో పని, ప్రస్తుతం ఉన్న పోస్టులు, అదనంగా కావాల్సిన పోస్టుల వివరాలతో సమగ్రంగా నివేదిక పంపింది. దీన్ని పరిశీలించిన సీఎం మరోసారి ప్రతిపాదనలపై సమాలోచనలు చేసిన అనంతరం కొత్త నివేదికను పంపాలని ఆదేశించారు. ఈ బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌ శాఖ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించారు. ఆయా దశలు, స్థాయిల్లో సంప్రదింపుల అనంతరం పంపిన ప్రతిపాదలను ఆమోదించారు. దీనికి క్యాబినెట్‌ ఆమోదముద్ర సైతం పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం కొత్తగా నాలుగు చీఫ్‌ ఇంజినీర్‌, 12 సర్కిల్‌ ఇంజినీర్‌, 11 డివిజనల్‌ ఇంజినీర్‌, 60 సబ్‌ డివిజినల్‌ ఇంజినీర్‌ పోస్టులను మంజూరు చేసింది. కాగా ప్రస్తుతం డీఈ స్థాయి అధికారులుగా ప్రమోషన్లు ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతున్నది. దీనికి కారణం సాంకేతిక సమస్యేల కారణమని చెబుతున్నవారూ ఉన్నారు.