– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వృత్తిదారులకు ఆర్థిక సహాయం పథకాన్ని ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ వత్తిదారుల భవనంలో రాష్ట్రస్థాయి వృత్తి సంఘాల బాధ్యుల సమావేశం లెల్లేల బాలకష్ణ అధ్యక్షతన జరిగింది. దీనికి చెరుపల్లి సీతారాములు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కులవృత్తులను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.1లక్ష ఆర్థిక సహాయం పథకానికి ఆన్‌లైన్ ద్వారా 5 లక్షల 10 వేల మంది దరఖాస్తు చేశారని తెలిపారు. దరఖాస్తుల గడువు పూర్తయి రెండు నెలలు అవుతున్నా, ఆర్థిక సహకారానికి ప్రభుత్వం తగిన బడ్జెట్ నిధులు కేటాయించకపోవడంతో కాలయాపన జరుగుతుందని చెప్పారు. అనేక నియోజకవర్గాల్లో వెరిఫికేషన్ కూడా చేయడం లేదనీ, అది పూర్తయిన చోట వృత్తిదారులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తల్లో కొందరికే రూ. లక్ష ఆర్థిక సహకారం అందించి చేతులు దులుపుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయ న్నారు. చేతి వృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓబిసి గణాంకాలను చేపట్టి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచి వెనుకబడిన తరగతులకు ఉన్నత విద్య అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వృత్తి సంఘాల నాయకులు పైళ్ళ ఆశయ్య, ఉడత రవీందర్, బడుగు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.