రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలి కలెక్టరేట్ల ఎదుట ధర్నా

Second ANMs should be made regular Dharna in front of Collectorates– ఏఎన్‌ఎంల భర్తీ నోటిఫికేషన్‌ రద్దుకు డిమాండ్‌
– లేదంటే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రకటన
నవతెలంగాణ- విలేకరులు
ఎన్నో ఏండ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న తమను పర్మినెంట్‌ చేయకుండా.. ఏఎన్‌ఎంల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వడం సరికాదు. వెంటనే తమను పర్మినెంట్‌ చేయాలంటూ రెండో ఏఎన్‌ఎంలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఏఎన్‌ఎంలందరినీ రెగ్యులర్‌ చేయాలని సీఐటీయూ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు ధర్నా చేపట్టారు.రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏఎన్‌ఎంల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏన్‌ఎంలను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాకు సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మద్దతు తెలిపి మాట్లాడారు.ములుగు జిల్లా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు, డీఎంహెచ్‌ఓకు వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలు పరిష్కారం కానిపక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏవో మహేష్‌బాబుకు వినతి పత్రం అందించారు.