– సచివాలయం ప్రాంగణంలోని గుడి, చర్చి, మసీదుల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
– హాజరైన గవర్నర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘ఇది చాలా సంతోషకరమైన సమయం. మత సామరస్య స్ఫూర్తి పరిఢవిల్లింది. రాష్ట్రంలో ఇలాగే సౌభ్రాతత్వం వెల్లివిరియాలి. ఇందుకోసం ప్రభుత్వం తన కషిని కొనసాగిస్తుంది. ఈ దిశగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. పాత సచివాలయంలోని మసీదును మించి కొత్త సచివాలయంలో మసీదును సుందరంగా నిర్మించుకోవడం నాకు చాలా సంతోషాన్నిస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు యావత్ భారతదేశంలోని ముస్లింలకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
లౌకికతత్వాన్ని చాటేలా ఆలయాలు, మసీదులు, చర్చిలు వెలయాలి. ఈ మూడు ఒక్కచోట ఉన్న ప్రదేశానికి ఉత్తమ నిదర్శనంగా మన రాష్ట్ర సచివాలయం నిలుస్తుంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం వేదికగా రాష్ట్ర గవర్నర్ ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన మూడు ప్రార్థనా మందిరాలను శుక్రవారం వరుసగా ప్రారంభించారు. తొలుత, నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైన సచివాలయంలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయానికి సీఎం చేరుకున్నారు. గవర్నర్ రాగానే సాంప్రదాయ పద్ధతిలో మేళ తాళాలతో ఆహ్వానం పలికారు. గవర్నర్‌ను ఆహ్వానించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సీఎస్, ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన చర్చికి, గవర్నర్‌ను తోడ్కొని సీఎం కేసీఆర్ చేరుకున్నారు. క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పాస్టర్ తదితర మత పెద్దలు క్రీస్తు సందేశాన్ని వినిపించారు.సంప్రదాయం ప్రకారం కేక్‌ను కట్ చేశారు. ఆ తర్వాత పక్కనే నిర్మించిన మసీదుకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్‌తో పాటుగా వచ్చిన సీఎంకు ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో ఇమామ్, తదితర మత పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు. మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఇస్లాం మత పెద్దలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు కలిసిమెలిసి ముందుకు సాగుతూ, ప్రార్థనలు చేసుకుంటూ ఐకమత్యాన్ని చాటుతున్నారు.
యావత్ భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకోవచ్చు. రాష్ట్రంలో ఇదే విధమైన సుహద్భావ పరిస్థితులు సదా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఎల్లవేళలా శాంతి నెలకొని ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్‌అలీ, పువ్వాడ అజరు కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కోర్కంటి చందర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మెన్ గజ్జల నగేష్, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్‌సీ, గణపతిరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మాధవరం నరేందర్‌రావు, మంగ తదితరులు పాల్గొన్నారు.