విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా యూటీఎఫ్‌ పోరాటం

– సీనియర్‌ నాయకులు మోతుకూరి నరహరి
– హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమ కోసమే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) పోరాటాలు నిర్వహిస్తోందని ఆ సంఘం సీనియర్‌ నాయకులు, ప్రముఖ సాహితీవేత్త మోతుకూరి నరహరి చెప్పారు. యూటీఎఫ్‌ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కార్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం పతాకాన్ని నరహరి ఆవిష్కరించారు. అనంతరం టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాలు, యాజమాన్యాలు, కులాలు, క్యాడర్ల అంతరాలను అధిగమించి ఉపాధ్యాయులందరి కోసం ఏర్పాటైన మొట్ట మొదటి రాష్ట్ర వ్యాప్త ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్‌ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏండ్లు, తెలంగాణలో గత తొమ్మిదేండ్లుగా అది నిరంతరం పోరాడుతున్నదని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు అంతరాల్లేని విద్యావిధానం కోసం కొట్లాడుతున్నదని చెప్పారు. ఉపాధ్యాయులు ఈనాడు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ సంఘాల ఐక్య పోరాటాల ఫలితమేనని ఉద్ఘాటించారు. నేటి పాలకులు ఒక్కొక్క హక్కును హరించే ప్రయత్నిన్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి ఐక్య ఉద్యమాలద్వారా వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సంయుక్త మాట్లాడుతూ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో, హక్కులు, బాధ్యతలే ఉద్యమ నేత్రాలుగా యూటీఎఫ్‌ ప్రస్థానం సాగుతోందన్నారు. ఈ సంఘం ఆవిర్భవించాకే ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో నూతన ఒరవడి ప్రారంభమైందని చెప్పారు. మహిళలను నాయకత్వ స్థానాలకు ప్రోత్సహించటంలోనూ యూటీఎఫ్‌ ముందు వరుసలో ఉందన్నారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ వచ్చేఏడాది ఆగస్టు 10 వరకు ఏడాదిపాటు స్వర్ణోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. స్వర్ణోత్సవ కానుకగా ఈ ఏడాది టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమ నిధిని ప్రారంభించామని చెప్పారు. సభ్యుడు సర్వీసులో ఉండగా మరణిస్తే పది రోజుల్లో రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు పి మాణిక్‌రెడ్డి, కొండలరావు, మస్తాన్‌రావు, నరసింహాచారి, వందన, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరాజు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.