హరగోపాల్‌పై రాజద్రోహం కేసును ఉపసంహరించుకోవాలి

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై రాజద్రోహం కేసును ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పౌరహక్కుల నేత హరగోపాల్‌పై ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో రాజద్రోహం కింద కేసు నమోదు చేసినట్టు పత్రికల్లో చూశానని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి నక్సలైట్లతో సంబంధాలున్నాయనే నెపంతో కేసు పెట్టడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాలకూ నాణ్యమైన విద్య అందాలని కృషి చేస్తున్న విద్యావేత్త, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగినపుడు వారికి అండగా, నికరంగా నిలబడుతున్నారని తెలిపారు. ఆయన నిరంతరం పౌర హక్కుల కోసం పనిచేస్తున్న ప్రజాస్వామిక వాది అని వివరించారు. గొప్ప విద్యావేత్త అని పేర్కొన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని హరగోపాల్‌పై పెట్టిన రాజద్రోహం కేసును వెంటనే ఉపసంహరింపచేయాలని కోరారు.
ఇది అన్యాయం. : టీఎస్‌యూటీఎఫ్‌
ప్రముఖ విద్యావేత్త, సామాజిక హక్కుల కార్యకర్త ఆచార్య హరగోపాల్‌పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), రాజద్రోహం అభియోగాలతో బనాయించిన కేసును ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి డిమాండ్‌ చేశారు. మావోయిస్టుల డైరీలో పేరు ఉన్నంత మాత్రాన కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగం పట్ల అవ్యాజమైన ప్రేమ, స్పష్టమైన అవగాహన కలిగి, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య హక్కుగా అందాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా విద్యా పరిరక్షణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న మేధావి హరగోపాల్‌ అని తెలిపారు. ఆయనపై రాజద్రోహం, ఉపా కేసులు పెట్టటం అన్యాయం.
మేధావులపై ఉపా కేసులను ఎత్తేయాలి : కేవీపీఎస్‌
ప్రొఫెసర్‌ హరగోపాల్‌తోపాటు మరో 152 మందిపై అక్రమంగా పెట్టిన ఉపా కేసులను తక్షణమే ఉపసంహరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సివిల్స్‌ విద్యార్థులకు పాఠాలు బోధించడంతోపాటు ప్రజాస్వామిక ఉద్య మాల్లో భాగస్వాములవుతూ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా ఉన్న హరగోపాల్‌పై ఉపా కేసు పెట్టడ మేంటని ప్రశ్నించారు. తక్షణమే ఆ ఉపా కేసులను ఉపసంహరించాలని వారు డిమాండ్‌ చేశారు .
పీడీఎస్‌యూ ఖండన
విద్యావేత్తలు, హక్కుల నేతలపై ఉపా చట్టం బనాయించడాన్ని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్‌ తీవ్రంగా ఖండించారు. వారిపై కేసులు పెట్టడం సరైంది కాదని, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. 152 మందిపై నమోదు చేసిన ఉపా కేసును తక్షణమే ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.