జరిమానా సొమ్ముతో ఖజానా నింపుతారట

– బాధితుడికి మాత్రం పైసా ఇవ్వరట
– డీపీడీపీ బిల్లులో ప్రజా వ్యతిరేక నిబంధనలు
న్యూఢిల్లీ : ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే కంపెనీలు, సంస్థలు, వేదికలపై జరిమానాలు వడ్డించి, వచ్చిన ఆ డబ్బుతో ప్రభుత్వం తన ఖజానాను నింపుకుంటుండట. బాధిత వ్యక్తులకు మాత్రం మొండిచెయ్యి చూపుతుందట. డిజిటల్‌ పర్సనల్‌ డేటా బిల్లు (డీపీడీపీ) ప్రకారం… చట్టాన్ని ఉల్లంఘించే కంపెనీలకు డేటా ప్రొటెక్షన్‌ బోర్డు జరిమానాలు విధించవచ్చు. వసూలైన ఆ మొత్తాన్ని కన్సాలిడేటెడ్‌ నిధిలో జమ చేస్తారు. అయితే ఎవరి సమాచారం చౌర్యానికి గురైందో ఆ బాధితుడికి మాత్రం ఎలాంటి నష్టపరిహారం లభించదు.
ఫిర్యాదు చేయాలంటేనే భయం
వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే ఏ సంస్థ పైన అయినా డేటా ప్రొటెక్షన్‌ బోర్డు 250 కోట్ల రూపాయల వరకూ జరిమానా విధించవచ్చు. అయితే ఇందులో ఒక్క రూపాయి కూడా బాధితుడికి చేరదు. గతంలో బాధితుడికి ఐటీ చట్టంలోని సెక్షన్‌ 43-ఏ కింద నష్టపరిహారం లభించేది. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లులో ఆ సెక్షన్‌ను తొలగించారు. పైగా వినియోగదారులు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైతే రూ. 10 వేల వరకూ జరిమానా విధిస్తారు. ఉదాహరణకు వినియోగ దారుడు తప్పుడు లేదా పనికిమాలిన ఫిర్యాదు చేశాడనుకోండి. అతనికి జరిమానా విధించే అవకాశం ఉంది. దీనివల్ల ఫిర్యాదు చేయాలంటేనే వినియోగదారులు భయపడే పరిస్థితి నెలకొంటుంది. వినియోగదారుల సమాచార గోప్యత హక్కును పరిరక్షించడానికి బదులు వారి పైనే జరిమానాలు విధించడం సరికాదని నిపుణులు అభిప్రాయప డుతున్నారు. అదీకాక ఫిర్యాదు చేసినా బాధితుడికి ఒరిగేదేమీ ఉండదు. అతనికి ఒక్క రూపాయి కూడా పరిహారం లభించదు. పైగా తప్పుడు ఫిర్యాదు చేశారన్న సాకుతో జరిమానా విధిస్తారేమోనన్న భయం. ఇక ఎవరు మాత్రం ఫిర్యాదు చేస్తారు?
మొండిగా వ్యవహరించిన కేంద్రం
ప్రపంచంలోని అనేక దేశాలలో అమలులో ఉన్న డేటా ప్రొటెక్షన్‌ చట్టాల ప్రకారం బాధితులకు నష్టపరిహారం అందజేస్తారని, మన దేశంలో మాత్రం తాజా బిల్లుతో ఆ అవకాశమే లేకుండా పోయిందని ఖైతాన్‌ అండ్‌ కంపెనీ భాగస్వామి సుప్రతిమ్‌ చక్రవర్తి చెప్పారు. ఆర్థిక నేరాల విషయంలో వ్యవహరించిన విధంగానే బిల్లులోని నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తారని శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించుకునే హక్కును, అదే సమయంలో ఆ సమాచారాన్ని చట్టపరమైన ఉద్దేశాల కోసం వినియోగించుకునే అవకాశాన్ని… ఈ రెండింటినీ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు గుర్తిస్తోందని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బాధితులకు నష్టపరిహారం అందజేయకపోవడంపై కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌ చౌదరి, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు.