ప్రగతిరథ చక్రాలు ఆగవు

– ఆర్టీసీ విలీనంపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు
– ప్రతి పేదవాడూ మంత్రే :మంత్రి పువ్వాడ అజరు
– ఆర్టీసీ సిబ్బంది, మున్నేరు బాధితుల స్వాగతం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రగతి రథ చక్రాలు ఎన్నటికీ ఆగవని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రూ.150 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా ఆర్‌సీసీ వాల్‌ నిర్మాణానికి ఆమోదం లభించిందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని సోమవారం ఖమ్మం వచ్చిన మంత్రికి ఆర్టీసి సిబ్బంది, మున్నేరు బాధితులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు. మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం ఇప్పటికే రూ.180 కోట్లు మంజూరయ్యాయని, మున్నేరు ముంపు బారి నుంచి రక్షించేందుకు ఆర్‌సీసీ వాల్‌ నిర్మాణానికి మొన్నటి క్యాబినెట్‌లో రూ.150 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను నాలుగేండ్లుగా కడుపులో పెట్టుకున్నామని మంత్రి అన్నారు. ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఆదుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి రందీ లేదన్నారు.
ఉద్యోగ భద్రత ఉందన్నారు. వారిపై ఈగ కూడా వాలదని చెప్పారు. ప్రతి నెలా 1న జీతాలు అందుతాయని తెలిపారు. మున్నేరుకు ఇరువైపులా మట్టికట్టల జోలికి పోకుండా శాశ్వత పరిష్కారంగా ఆర్‌సీసీ వాల్‌ నిర్మిస్తున్నామన్నారు. మంత్రిగా మొదటిసారి ఖమ్మంలో అడుగుపెట్టినప్పుడు చెప్పిన మాటలే మళ్లీ చెబుతున్నాననంటూ ‘ప్రతి పేదవాడూ మంత్రే’ అన్నారు. ఖమ్మానికి పట్టిన అన్ని రుగ్మతలను మంత్రదండం ద్వారా పరిష్కారం చేశానన్నారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టం చేశారు.