బస్‌ స్టేషన్‌ అధికారుల ఇష్టారాజ్యం!

– బస్‌స్టేషన్‌లో ప్రమాదకరంగా పాతిన పైపులు
– ప్రమాదాలకు గురవుతున్న బస్సులు ప్రయాణికులు
– ఉచిత టాయిలెట్ల స్థానంలో హౌటల్‌
– రూ.5.70 లక్షలు వృథా చేసిన అధికారులు
శంషాబాద్‌ బస్‌ స్టేషన్‌లో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం వ్యాపారాలకు అనుమతులు ఇస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనీసం బస్సులు నిలపడానికి కూడా అవకాశం లేకుండా స్థలం మొత్తం అద్దెకు ఇస్తున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి శంషాబాద్‌ బస్‌ స్టేషన్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్ర విమర్శలకు దారి తీస్తున్నది.
నవతెలంగాణ-శంషాబాద్‌
ఇటీవల శంషాబాద్‌ బస్‌ స్టేషన్‌లో రెండు సులబ్‌ కాంప్లెక్స్‌ మధ్యలో హౌటల్‌ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఈ హౌటల్‌ నిర్మాణ స్థలంలో ఇంతకు ముందు రూ.5.70 లక్షలతో శంషాబాద్‌ మున్సిపల్‌ అధికారులు ఉచిత టాయిలెట్లు నిర్మించి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా ఆర్టీసీ అధి కారులు తీసుకోలేదు. దీంతో రూ.5.70 లక్షలు బూడిదలో పోసిన పన్నీరయింది. ఉచిత టాయిలెట్లను తొలగించి హౌటల్‌ ఏర్పాటుకు ఏ మాత్రం అనుకూలంగా లేని ప్రదే శంలో అనుమతి ఇస్తే వారు నిర్మాణం చేశారు. అయితే హౌటల్‌ ముందు పార్కింగ్‌ కోసమంటూ కొంత ముందుకు జరిగి రెండు ఇనుప పైపులను పాతారు. దీంతో శం షాబాద్‌ బస్‌ స్టేషన్‌ నుంచి షాబాద్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులకు హైదరాబాద్‌ నుంచి బస్‌ స్టేషన్‌లోకి వచ్చే బస్సులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. బస్సును చూసుకుంటూ వెళ్లి ప్రయాణికుల సైతం పైపులకు తగులుతున్నారు. చాలా సందర్భాల్లో బస్సులు వాటికి సమీపం నుంచి రాసుకుంటూ వెళ్తున్నాయి. అసలు బస్‌ స్టేషన్‌ ప్రధాన ప్రదేశంలో పార్కింగ్‌ కోసం స్థలం ఇవ్వడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్‌ స్టేషన్‌ మొత్తంలో ఇక్కడ కూడా పార్కింగ్‌ స్థలం ఇవ్వని అధికారులు ఆర్టీసీ బస్సులకు ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నచోట అనుమతులు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రమాదక రంగా పాతిన పైపులను వెంటనే తొలగించాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.
హౌటల్‌ పార్కింగ్‌ కోసమని పైపులు పాతారు
శంషాబాద్‌ బస్‌స్టేషన్‌లో హౌటల్‌ నిర్వాహణ కోసం అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే హౌటల్‌కు వచ్చే వారి కోసం పార్కింగ్‌ స్థలం కావాలంటే కొంత స్థలం వాళ్ల పరిధిలో ఉండే విధంగా అక్కడ పైపులు పాతాం. దీని వలన ప్రయాణికులకు, బస్సులకు ఇబ్బంది జరుగుతుందని అభ్యంతరాలు వస్తే ఉన్నత అధికారులకు చెప్పి తొలగిస్తాం.
– సత్యనారాయణ, శంషాబాద్‌ బస్‌ స్టేషన్‌ మేనేజర్‌
వ్యాపార కోణంలోనే ఆలోచిస్తున్నారు
శంషాబాద్‌ బస్‌ స్టేషన్‌లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా వ్యాపార దృష్టితోనే అధికారులు ఆలోచిస్తున్నారు. ఉచిత టాయిలెట్లు నిర్మించి వాటిని ఉపయోగించకుండానే కూల్చేశారు. వాటి స్థానంలో హౌటల్‌ పెట్టి పార్కింగ్‌ కోసం అంటూ కొంత స్థలానికి పైపులు పాతారు. బస్‌ స్టేషన్‌ మొత్తంలో ఎక్కడ పార్కింగ్‌ స్థలం కేటాయించనీ అధికారులు బస్సులు రద్దీగా ఉండే చోట పార్కింగ్‌ స్థలం కేటాయించడం సరైనది కాదు. ప్రమా దాలు జరిగే అవకాశం ఉన్నందున వెంటనే వాటిని తొలగిం చాలి. హౌటల్‌కి వచ్చేవాళ్ళకి ప్రత్యామ్నాయం చూపాలి.
– జే. సామెల్‌, సీఐటీయూ నాయకులు