వార్డు ఆఫీసులో పామును వదిలిన యువకుడు

– ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన
నవతెలంగాణ- నేరేడ్‌మెట్‌
వరద నీటితోపాటు పాములు కూడా ఇండ్లలోకి వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఓ పామును పట్టుకొచ్చి నేరుగా జీహెచ్‌ఎంసీ వార్డు ఆఫీసులో వదిలి పెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌ అల్వాల్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
భారీ వర్షాలకు నగరంలో పలుచోట్ల ఇండ్లలోకి వరద నీరు వస్తోంది. అల్వాల్‌ ప్రాంతంలో సంపత్‌కుమార్‌ ఇంట్లోకి వరద నీటితోపాటు ఓ పాము కూడా వచ్చింది. దాంతో అతను వెంటనే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో అతను ఓ పామును పట్టుకుని నేరుగా అల్వాల్‌ జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయానికి తీసుకొచ్చాడు. అక్కడ టేబుల్‌పై పామును వదిలిపెట్టి నిరసన తెలిపాడు. దీంతో అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.