ఇండ్లస్థలాలపై రాజీలేనిపోరు

– 24న జర్నలిస్టులు,రాజకీయపార్టీలతో సెమినార్‌
– టీడబ్ల్యూజేఎఫ్‌ ఓబీ తీర్మానం ప్రభుత్వ ఉద్యోగుల్లాగే జర్నలిస్టులకు
– ఆరోగ్య పథకాన్ని అమలుచేయాలంటూ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్లస్థలాలు ఇచ్చేవరకు రాజీలేనిపోరాటం చేయాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశం తీర్మానించింది. ఈనెల 24న సీనియర్‌ జర్నలిస్టులు, రాజకీయపక్షాలతో హైదరాబాద్‌లో సెమినార్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. శనివారం నగరంలోని త్యాగరాయగానసభలో ఫెడరేషన్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య అధ్యక్షత వహించగా, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య గత కార్యకాలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై ఆఫీసు బేరర్ల సమావేశం రోజంతా చర్చించింది. సమాజానికి విస్త్రృతంగా సేవలు అందిస్తున్న జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడటం సరైంది కాదని అభిప్రాయపడింది. గత 35 ఏండ్లుగా రాష్ట్రంలో స్థలాలు ఇవ్వలేదని గుర్తు చేసింది. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోవడం న్యాయం కాదని అభిప్రాయపడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. సెమినార్‌ తర్వాత కూడా స్పందించకపోతే ఇందిరాపార్క్‌ దగ్గర రిలే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జర్నలిస్టుల ఇండ్లస్థలాలపై ఒక విధాన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు హామి ఇచ్చినట్టుగా జర్నలిస్టులకు సైతం ఆరోగ్యపథకాన్ని ఉచితంగా వర్తింపచేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలాగే కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన రైల్వే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబరు నెలాఖరులో ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఆఫీసు బేరర్ల సమావేశం ప్రకటించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయనున్నామనీ, భారీసంఖ్యలో జర్నలిస్టులు పాల్గొనాలని సూచించింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ ఆఫీసు బేరర్లు పి.ఆనందం, ఎస్‌కె సలీమ, ఆర్‌.వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.