– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు
– హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ పాదయాత్ర
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతుల్లేవని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, సంక్షేమ వసతి గృహాల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ సెంట్రల్ సిటి, ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మూడ్రోజుల అధ్యయన యాత్రలు శనివారం ముగిశాయి.
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే ఒక్క కళాశాలలో కూడా పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ పంపిణీ చేయలేదని, యూనిఫామ్ ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్, లెక్చరర్స్, వార్డెన్స్, ఎంఈఓలు, వర్కర్స్ ఇంకా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వ భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయని తెలిపారు. సబ్జెక్టులకు కూడా టీచర్లు సరిగా లేరన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మన్న ట్రస్ట్ నుంచి వచ్చే భోజనాలను రద్దు చేసి.. మధ్యాహ్న భోజన కార్మికులను పెట్టి వండించి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే చలో ప్రగతిభవన్ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.