లీగల్‌ నోటీసుల ఉపసంహరణ ప్రశ్నేలేదు

– అధికారులు, సంస్థ పనితీరుపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయం : హెచ్‌ఎండీఏ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఎంపీ రేవంత్‌ రెడ్డికి జారీ చేసిన లీగల్‌ నోటీసును ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. అధికారులు, సంస్థ పనితీరుపై అపోహలు, రాజకీయ ఉద్దేశాలను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా అధికారుల పేర్లను అభ్యంతరం వ్యక్తం చేయడం హెచ్‌ఎండీఏ తీవ్రంగా వ్యతిరేకింది. ఈ సందర్భంగా హెచ్‌ఎమ్‌డీఏ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వానికిలోబడి, ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఎమ్‌డీఏ పనిచేస్తుందని పేర్కొంది. ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ) టాట్‌ బిడ్‌ కోసం నిర్దేశించిన నిబంధనలను అనుసరించి ఓఆర్‌ఆర్‌ టాట్‌ బిడ్‌ ప్రక్రియ అత్యంత పారదర్శంగా నిర్వహించినట్టు చెప్పింది. 30 ఏండ్ల టాట్‌ బిడ్‌ మంత్రి మండలి నిర్ణయానికి అనుగుణంగా ఉందని, ఎన్‌హెచ్‌ఏఐ రెండు బిడ్‌లు 30 ఏండ్ల కాలానికి ఖరారు అయ్యాయని, టాట్‌ చేయడం ఇది మొదటిసారి కాదని హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆర్‌టీఐ ప్రశ్నలకు సకాలంలో వివరాలు ఇచ్చామని పేర్కొంది. ఓఆర్‌ఆర్‌ టీట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచడం లేదని హెచ్‌ఎమ్‌డీఏ స్పష్టం చేసింది.