అవి ఆదివాసీ ప్రాంతాలే : హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్‌ : ములుగు జిల్లా మంగపేట మండలం లోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ పరిధిలోకి వస్తాయని హైకోర్టు బుధవారం కీలక తీర్పు చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ ఈ తీర్పు చెప్పింది. సుమారు 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాట తర్వాత సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ప్రభుత్వం తాలూకాలను పునర్‌విభజన చర్యల్లో భాగంగా పాల్వంచ పరిధి నుంచి 23 గ్రామాలను మంగపేట పరిధిలోకి తెచ్చింది. ఇలా చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమని దాఖలైన కేసుల్ని సింగిల్‌ జడ్జి కొట్టేశారు. రాజ్యాంగం అమలోకి రావడానికి ముందే ఆ గ్రామాలన్నీ నిజాం పాలనలో షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నాయన్న తీర్పును సవాల్‌ చేసిన అప్పీల్‌ను సీజే బెంచ్‌ కొట్టేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సమర్ధించింది. నిజాం కాలంలోనే షెడ్యూల్‌ ఏరియాలో ఉన్న గ్రామాలని, తర్వాత రాజ్యాంగం వచ్చాక కూడా షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నాయని, కేవలం తాలూకా పునర్‌విభజన చర్యల్లో భాగంగా ఒక తాలూకా నుంచి మరో తాలూకాకు మారాయని, వాటిని నాన్‌ షెడ్యూల్‌ ఏరియాగా ప్రభుత్వాలు ప్రకటించలేదని తీర్పులో స్పష్టం చేసింది.
2 వేల ఇళ్ల ఆక్రమణల్ని తొలగించవద్దు : స్టే ఆర్డర్‌
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నడ్డిగడ్డలో 40 ఎకరాల్లోని ఆక్రమణల నివాసాలను తొలగించరాదని హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. తొలగింపు చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్‌పీఎఫ్‌ను ఆదేశించింది. ఆక్రమించుకుని 40 ఏళ్లుగా ఉంటున్న వారిపై ఇంతకాలానికి మేల్కొనడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించింది. 2 వేల కుటుంబాలు ఉంటే వాళ్లను ఖాళీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని కూడా అడిండి. ఆ కుటుంబాలకు ఆధార్‌ కార్డులు, ఓటర్‌ కార్డులు, రేషన్‌కార్డులు ఇచ్చారని,హడావుడిగా ఆక్రమణల్ని తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాలను ప్రశ్నించింది. విచారణను ఆగస్టు 23కు వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు స్టే అమల్లో ఉంటుందని చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బెంచ్‌ ప్రకటించింది.