ముంబయి : తనను పదవి నుండి తొలగించే హక్కు అజిత్ పవార్ బృదానికి లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మంగళవారం పేర్కొన్నారు. ఎన్‌సిపి ఎమ్మెల్యేలందరూ (మొత్తం 53 మంది) ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్‌తోనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ బందానిది ”నోషనలిస్ట్” (అప్రమాణమైన) పార్టీ అని, వారికి తనను తొలగించే హక్కులేదని స్పష్టం చేశారు. వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలందరూ తమతోనే ఉన్నారని, త్వరలోనే ఆ విషయం మీకు తెలుస్తుందని అజిత్‌పవార్‌నుద్దేశించి అన్నారు. జయంత్ పాటిల్ స్థానంలో మహారాష్ట్ర ఎన్‌సిపి అధ్యక్షుడిగా సునీల్ తట్కరేని అజిత్ పవార్ బందం సోమవారం నియమించిన సంగతి తెలిసిందే. అలాగే జయంత్ పాటిల్, జితేంద్ర అవద్‌లను శాసనసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను కోరింది. తమకు 40 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ బందం రాజ్‌భవన్‌కి ఓ లేఖను కూడా సమర్పించింది.