ఈ పాప ఎంతో అపురూపం – చిరంజీవి

మెగాస్టార్‌ ఇంట సంబరాలు మిన్నంటాయి. రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉసాపన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అపోలో అస్పత్రి ప్రకటన విడుదల చేసింది. మనవరాలు పుట్టటంపై చిరంజీవి మీడియాతో స్పందిస్తూ, ‘మంగళవారం ఉదయం 1 గంట 49 నిమిషాలకు రామ్‌చరణ్‌, ఉపాసనలకు పాప పుట్టింది. ఇంటిల్లి పాది చాలా సంతోషంగా ఉన్నాం. ఈ పాప ఎంతో అపురూపం. మమ్మల్ని గ్రాండ్‌ పేరెంట్స్‌ చేసింది. పాప పుట్టిన ఘడియలు పెద్దలు చాలా మంచివని అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చరణ్‌ ఎదుగుదల, తను సాధించిన విజయాలు, అలాగే వరుణ్‌ తేజ్‌ ఎంగేజ్‌మెంట్‌. ఇలా మా ఇంట్లో అన్నీ శుభకార్యాలే జరగటం చూస్తుంటే ఈ బిడ్డ ప్రభావం మాపై ఉంది. నా కుటుంబం ఆంజనేయ స్వామినే నమ్ముకున్నాం. ఆయనకు సంబంధించిన మంగళవారం రోజున ఆడ బిడ్డను ప్రసాదించటం అనేది అపురూపంగా భావిస్తున్నాం’ అని ఆనందం వ్యక్తం చేశారు.