పర్యావరణాన్ని విస్మరిస్తే..ఈ దశాబ్దమే చివరిది..

–  ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఐప్సో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో శాస్త్రవేత్త బాబూరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పర్యావరణాన్ని విస్మరిస్తే ఈ దశాబ్దమే మనకు చివరి దవుతుందని ప్రముఖ పర్యావ రణ శాస్త్రవేత్త కె బాబూరావు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం(ఐప్సో) హైదరాబాద్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2023’పై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సంఘం నగర అధ్యక్షులు జి నాగేశ్వర్‌రావు అధ్యక్షత వహించారు. అంతకు ముందు సుందరయ్య పార్కులో ఐప్సో జాతీయ కౌన్సిల్‌ అడ్వజరీ కమిటీ నాయకులు యాదవరెడ్డి, పలువురు నాయకులు మొక్కలు నాటారు. అనంతరం రౌండ్‌టేబుల్‌లో బాబూరావు మాట్లాడుతూ పర్యావరణం లేకుండా మనం లేమని చెప్పారు. దాన్ని విస్మరిస్తే వినాశనమేనని ప్రపంచంలో పలు దేశాల అనుభవాలు చెబుతున్నాయని వివరించారు. పెట్టుబడిదారీ విధానంలో వచ్చిన మార్పుల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే..మన ఉనికే భోగోళంతో ముడిపడి ఉందని తెలిపారు.’ ఈ దశాబ్దమే చివరి దశాబ్దం కాకూడదు. మనం మారాలి. లేదంటే మానవ జీవితమే కష్టం’ అని ప్రముఖ శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారని వివరించారు. అయితే..శాస్త్ర వేత్తల మాటలు పరిగణలోకి తీసుకునే వారే లేక పోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అన్యాయమని చెప్పిన శాస్త్రవేత్తలను సైతం అరెస్టులు చేస్తున్నారనీ, వారిని జైళ్లలో కూడా కుక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ మనుగడకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ అంశంపై రాజకీయ పార్టీలు ఎందుకు నోరు విప్పటం లేదని ప్రశ్నించారు. చమురు, బొగ్గుని ఎంత ఎక్కువగా వాడితే.. జీవ రాశికి అంత ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్టేనని చెప్పారు. యూరప్‌ దేశాల్లో దీనిపై ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. పర్యావరణమనేది సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాల్లోనూ ఉంటుందని వివరించారు. మూసీ నదిని నాశనం చేయటం కోసమే 111జీవో రద్దు చేశారని చెప్పారు. ప్రముఖ పర్యావరణ వేత్త సరస్వతి కవుల మాట్లాడుతూ మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ జీవన గతిని దారిమళ్లిస్తున్నదని గుర్తుచేశారు. దాని మాయలో అందరరమూ పడ్డామన్నారు. సోషల్‌ ఆలోచన విధానమే నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యకారకమైన పరిశ్రమలు మనకు అవసరమా? అని ప్రశ్నిం చారు. సంస్కారం కోసం చదువు కావాలి కానీ..డిగ్రీల కోసమైతే.. సమా జానికి ఏ మాత్రమూ ఉపయోగం ఉండబోదన్నారు. వ్యసాయ ఆధారిత అభివృద్దే సమాజానికి అవసర మని చెప్పారు. యాదవరెడ్డి మాట్లాడుతూ హరిత హారం పేర చెట్లు నాటుతున్నారు కానీ..వాటి సం రక్షణను మాత్రం మరిచిపోతున్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో పంచాయతీలపై బాధ్యత పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నదని విమర్శిం చారు. పర్యావరణ పరిరక్షణ అనేది పాలకుల ముందు, ప్రజల ముందు తక్షణమే పరిష్కరించ వలసిన సమస్యగా ఉందని చెప్పారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. ఐప్సో నగర అధ్యక్షులు జి నాగేశ్వరరావు పర్యావరణ పరిరక్షణపై రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కార్యక్రమంలో ఐప్సో నాయకులు జి రఘుపాల్‌, తిప్పర్తి యాదయ్య, కేవీఎల్‌, మోతుకూరి నరహరి, జేకే శ్రీనివాస్‌, ఎ రామరాజ్‌ మాట్లాడారు.