సమాజానికి కనువిప్పు ఈ కవిత

జింబో ఆషామాషీగా ఏదిపడితే అది రాసే కవి కాదు. నిబద్ధత గల వ్యక్తి. న్యాయవాదిగా పనిచేసిన అనుభవం, తర్వాత మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. వివిధ హోదాల్లో పని చేస్తూ జిల్లా జడ్జిగా రిటైర్‌ అయ్యారు. న్యాయార్థులై వచ్చిన కక్షిదారుల వేదనలకు పరితాపం చెంది కవితకు అక్షర రూపం ఇచ్చారు. ఈ అవ్యవస్థలో న్యాయం నలిగిపోతున్నది. గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా న్యాయమూర్తి స్థానంలో కూర్చుండి, తనకున్న పరిశీలనా దక్పథంతో ఎంతో వేదన చెంది కవితకు ప్రాణం పోశాడనిపిస్తుంది.
ఈనాటి సమాజంలో న్యాయం ఎండమావిలా తయారైంది. కళ్ళతో చూస్తే న్యాయం దగ్గరగా కనబడుతుంది. కాని న్యాయం అందకుండా చేసే దుర్మార్గుల రాజ్యం కొనసాగుతుంది. ఇవ్వాళున్న వ్యవస్థ లో మంచి కొరకు, మంచి సమాజం కొరకు పాటు పడుతున్న వాళ్లను కేసులు పెట్టి వేధిస్తున్న సంఘ టనలు మనం నిత్యం చూస్తున్నాం. ఈ కవిత సమాజానికి కనువిప్పు కలిగేలా ఉంది. అందరు చదవాల్సిన కవిత.
”మనిషిని నిటారుగా / నడవకుండా చేయడానికి / వాడి వెన్నెముకని / విరవాల్సిన పనిలేదు”
మనిషి చక్కగా నిలబడాలన్నా, నడవాలన్నా, అతని వెన్నెముక పటిష్టంగా ఉండాలి. వెన్నెముక దెబ్బతిన్న ప్రతి వారికి అనుభవైకవేధ్యమే. కానీ కవి జింబో ఒక మనిషిని లొంగదీసుకోవాలన్నా, అతనిని న్యాయం కోసం, ధర్మం కోసం, నిలబడి పోరాటం చేయకుండా ఉంచాలంటే అతని వెన్నెముక ను విరవాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా అతనిపై ఒక కేసు పెడితేచాలు. తద్వారా అతని వెన్నెముక బలహీనపడి అతని పోరాటపటిమ సన్నగిల్లుతుందని వివరిస్తున్నాడు. కవి జింబో ఈ కవితా పంక్తుల ద్వారా న్యాయస్థానాల్లో కేసులపై జరుగుతున్న వాస్తవ స్థితిగతుల వైపు మనం దష్టి సారించే విధంగా చేసి మనలను జాగతపరుస్తున్నాడు.
”మనిషిని వంగపెట్టడానికి / వాడి వీపు మీద
రాళ్లు రప్పల్ని / ఎత్తాల్సిన పనిలేదు”
మనిషిని వంగపెట్టడానికి వాడి వీపు మీద రాళ్లు రప్పల్ని ఎత్తితే సరిపోతుంది అనే విషయం మన అందరికీ తెలుసు. కవి, జింబో న్యాయమూర్తిగా వేల కేసులను చూసి పరిశీలించి, ఒక్క కేసు పెడితే చాలు. మనిషిని వంగ పెట్టడానికి వాడి వీపు మీద రాళ్లు రప్పల్ని ఎత్తాల్సిన పనిలేదు అనే నిజాన్ని మనకు తెలియజేస్తున్నాడు.
”మనిషిని పిండి పిండి / చేయడానికి / వాడిని విసుర్రాయి కింద / నలపాల్సిన పనిలేదు”
”మనిషిని పిప్పి పిప్పి / చేయడానికి / చెరకు రసం మిషన్‌ / అవసరం లేదు”
ఒక్క కేసు పెడితే చాలు. మనిషిని పిప్పి పిప్పి చేయడానికి చెరకు రసం మిషన్‌ అవసరం లేదు అనే నిజాన్ని మనకు తెలియజేస్తున్నాడు.
”మనిషిని నిర్వీర్యం / చెయ్యడానికి / చిత్ర హింసల ప్రయోగాలు / రుచి చూపించాల్సిన పని లేదు”
మనిషిని నిర్వీర్యం చెయ్యడానికి చిత్ర హింసల ప్రయోగాలు రుచి చూపించాల్సిన పని ఉంది అని మన అందరికీ తెలుసు. పోలీసు అధికారులు చిత్ర హింసలు పెట్టి మరియమ్మ అనే దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఈ మధ్యనే ముస్లిం వర్గానికి చెందిన యువకుడు ఖదీర్‌ ఖాన్‌ ఏదో నేరం చేశాడని పోలీసు స్టేషన్‌ లోనే చిత్రహింసలు పెట్టి చంపివేసిన సంఘటనలు మనమెరిగినదే. పోలీసులు చిత్ర హింసలు పెట్టి థర్డ్‌ డిగ్రీ పద్ధతులు ఉపయోగించి పోలీసులు నేరం ఆరోపించబడిన వ్యక్తులను చంపి వేస్తున్న సంఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. బ్రిటిష్‌ కాలం నాటి పోలీసుల్లాగే ప్రవర్తిస్తూ అమాయకులను పోలీస్‌ స్టేషన్‌లోనే విచారణకు గురిచేస్తూ చంపేస్తున్నారు.
”మనిషిని అణగదొక్కడానికి / రోడ్డు రోలరు / అంత కంటే అవసరం లేదు”
ఒక్క చిన్న కేసు చాలు వాడి సున్నితత్వాన్ని బట్టి మనిషి భయంలోకి వెళ్లిపోతాడు. ఆందోళనకు గురి అవుతాడు అనే నిజం మనకు తెలియజేస్తున్నాడు.
”అది అన్నలకు / అన్నం పెట్టిన కేసే కావచ్చు”
ఆకలి అయిన వాడికి అన్నం పెడితే నేరమా? ఆ కేసు పేరిట పోలీసుల దర్యాప్తులు, విచారణకు పిలుపులు, వేధింపులు భరించలేకపోతారు. కేసుల పేరిట వాణ్ని నిర్వీర్యం చేస్తారు.
”అన్నం పెట్టలేదనే / మనోవర్తి కేసే కావచ్చు”
అందులో నిజానిజాలు తేల్చక ముందే, కేసు పెట్టగానే ఎంత బుగులు, ఎంత దిగులు, కలవరం ఉంటుందో మనమంతా ఎరిగినదే.
”కట్నం అడిగిన కేసే కావచ్చు”
నిజంగా కట్నం అడిగిన కేసుల్లో అమ్మాయి తల్లిదండ్రులు అదనపు కట్నం లాంఛనాలు ఇచ్చే స్తోమత లేనందువలన కుములుతుంటారు.
అదనపు కట్నం తీసుకు రానందుకు భర్త, అత్తా, మామలు, ఆడ పడుచు, మరిది, అమ్మాయిని హింస పెట్టి కిరోసిన్‌ పోసి చంపుతున్న ఘటనలు కోకొల్లలు.
”కానుకలు దొంగిలించిన కేసే కావచ్చు” ఎవరు కానుకలు దొంగిలించారు? అసలైన వ్యక్తిని పట్టుకోరు. అమాయకులపై కేసు పెట్టి వేధిస్తారు.
”తన్నులు తిన్న కేసే కావచ్చు” ఎందుకు తన్నులు తిన్నారు? ఇవ్వాళ క్రౌర్యం పెరిగి అమాయకులను హింసించడం జరుగుతున్నది. మానవ హక్కుల హననం రోజు జరుగుతున్నదే. రాజ్యాంగం కల్పించిన, జీవించే హక్కును కాలరాచే చర్యలు నిత్యం పత్రికల్లో చూస్తూన్నాం.
”తన్నిన కేసే కావచ్చు / కన్ను కొట్టిన కేసే కావచ్చు / కన్ను పీకేసిన కేసే కావచ్చు / బాకీ తీసుకున్న కేసే కావచ్చు / బార్డర్‌ పంచాయితీ కావచ్చు”
బార్డర్‌ పంచాయితీ కేసులు గ్రామాల్లో, పట్టణంలో నలుగుతూ ఉంటాయి. కుట్ర కేసు కావచ్చు. దేశ ద్రోహానికి పాల్పడ్డాడని అమాయకుల పై తప్పుడు కుట్ర కేసులు పెట్టడం ఆనవాయితీగా మారింది.
ఖూనీ కేసు కావచ్చు. ఏదో ఒక్కటి వేధించడానికి ఏదో ఒక్కటి కేసులో ఇరికించి అమాయకులను ఇబ్బంది పెడతారు.
”తల నరికిన కోడిపెట్ట మొండెంలా మనిషి కొట్టుకోవడానికి తల లేని మనిషిని చేయడానికి తల నరికిన కోడిపెట్ట మొండం కూడా ప్రాణం ఉన్నట్లు బాధతో కొట్టుకుంటుంది. ప్రాణం తీశారని కోడి విలవిలలాడుతుంది.
తల లేని మనిషిని చేసి కేసులు పెట్టి విలవిల లాడిస్తున్నారు. ఇవ్వాళ ఉన్న వ్యవస్థలో న్యాయం ఎండ మావిలా తయారయింది. ఎండమావిలో ప్రయాణిస్తుంటే మనకు నీరు దగ్గరగా చేరువలో ఉన్నట్టు అనిపిస్తుంది. మనం అక్కడికి వెళితే ఏమీ ఉండదు. ఒక్క చోట మాట్లాడుతుంటే విన్నాను. న్యాయస్థానాలు లేవని మాట్లాడుతున్నారు. ఇవ్వాళ న్యాయం న్యాయస్థానంలో దొరకదని అంటున్నారు. ప్రజలు ఎంతో బాధతో న్యాయస్థానాల్లో న్యాయం లభించదని ఘంటాపథంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాను. వారు అనే మాటలను గూర్చి ఆలోచించవలసి వచ్చింది.
న్యాయస్థానాలు నమ్మకం కోల్పోయాయి అనిపించింది. అప్పుడప్పుడు న్యాయ స్థానాలు ప్రజల తరపున నిలుస్తూ చక్కటి తీర్పులు ఇస్తున్నాయి. న్యాయస్థానాలను మనం కాపాడుకుంటేనే భావితరాల జీవితాలు సౌఖ్యంగా ఉంటాయి. లేకుంటే బాధలతో నిండిపోతాం.
”కేసులు కేసుల కోసమే పెడ్తారు అనేది వాస్తవం. మనిషిని లొంగ తీయడానికి పెడ్తారు. భయంతో మనిషి లొంగి పోతాడనే ఉద్దేశ్యంతో కేసు పెడ్తారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.
”కోర్టుని దీపం చేసి / మనిషిని పురుగుని చేసి” వినోదించడానికి పెడ్తారు. మనం దీపం వెలిగిస్తే దీపం చుట్టు పురుగులు చేరతాయి. దీపం దగ్గరకు చేరి పురుగులు మాడిమసై పోతాయి. కోర్టుల చుట్టు తిరిగిన మనిషికి న్యాయం అందడం లేదు. న్యాయమందకుండానే మనిషి కోర్టుల చుట్టూ తిరిగి దీపపు పురుగుల్లా మాడి మసై పోతున్నాడు. ఇవ్వాళ న్యాయం ను కాపాడు కోవాల్సిన ఆవశ్యకతను కవి తెలియ జేశాడు. ఒక్క కేసు చాలు కవిత సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంది.

– నరేంద్ర సందినేని