ఈ అవ్వకు ఫాలోయింగ్‌ ఎక్కువ 89 ఏండ్ల వీరమ్మాళ్‌ పాటి…

Don't be this The following is high According to 89-year-old Veerammal...తమిళనాడులోని మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశమైన అరిట్టపట్టి పంచాయతీ ప్రెసిడెంట్‌. ఈ వయసులోనూ జనం సమస్యలు చూస్తే ఆమె రక్తం ఉడికిపోతున్నది. ఆ సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తూనే ఉంది. తన గ్రామాన్ని మార్చాలనే లక్ష్యంతో 300 ఇండ్లకు అవసరమైన పాఠశాలలు, వంతెనలు, తాగునీటి కుళాయిలను నిర్మించిన ఆమెను ఇటీవలె ఐఎఎస్‌ అధికారి సుప్రియా సాహు సోషల్‌ మీడియా వేదికగా  ప్రశంసలతో ముంచెత్తారు.
89 ఏండ్ల వీరమ్మాళ్‌ పాటి (తమిళంలో అమ్మమ్మ) తమిళనాడులో అత్యంత పురాతనమైన పంచాయతీకి ప్రస్తుతం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది ఆమె నేతృత్వంలోని మదురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర మొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేసింది. పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీ శాఖలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అయిన ఐఎఎస్‌ అధికారి సుప్రియా సాహుకు ఇటీవల అరిట్టపాటి ఆతిథ్యం ఇచ్చారు. ‘వీరమ్మాళ్‌ తన జీవితమంతా ఈ గ్రామ అభివృద్ధికి ధారపోస్తూనే ఉన్నారు. గ్రామంలో పుట్టి, పెరిగి, పెండ్లి చేసుకున్న ఆమె తన యవ్వనంలో యువతులకు వ్యవసాయం కోసం రుణాలు పొందేందుకు, కుటుంబ వివాదాలను పరిష్కరించడంలో వారికి సహాయపడే స్వయం సహాయక బృందాలకు నాయకత్వం వహించారు’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు ప్రియాంక. దాంతో యువతలో ఆమెకు ఫాలోయింగ్‌ పెరిగిపోతున్నది.
ప్రజల కోసం తపిస్తూ…
‘గ్రామానికి తిరిగి ఇవ్వాలనే తపన మా కుటుంబంలో ఎప్పుడూ ఉంటుంది. మా అన్నయ్య గ్రామ అభివృద్ధికి కృషి చేసాడు. నా భర్త ఒక ఏడాది మొత్తం పంచాయతీ వైస్‌ ప్రెసిడెంట్‌గా సేవలు అందించాడు’ అంటుంది ఆమె. వీరమ్మాళ్‌ స్వయంగా పంచాయతీ ఎన్నికలకు 2006, 2011లో పోటీ చేసింది. చివరికి 2020లో తన 86 ఏండ్ల వయసులో మూడోసారి పోటీ చేసి గెలుపొందింది. ‘గ్రామ ప్రజలు, ప్రత్యేకించి మహిళలు, వారి ఆశయాల పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే ఆమెను పంచాయతీ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. ప్రజల పట్ల తనకున్న శ్రద్ధను నిరూపించుకుంటూ వారి కోసం ఏండ్ల తరబడి శ్రమిస్తూ, గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మంచి పేరును సంపాదించుకున్న’ అని అరిట్టపట్టి గ్రామ అటవీ కమిటీ హెడ్‌ ఆర్‌ ఒడయన్‌ అంటున్నారు.
ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ…
‘నేను చివరకు నా ప్రజల జీవితాలను మార్చగల స్థితిలో ఉన్నాననే నమ్మకం వచ్చింది’ అని ఆమె చెప్పారు. గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. తన మూడేండ్ల పదవీ కాలంలో వీరమ్మాళ్‌ నాలుగు నీటి ట్యాంకులు, నీటి వంతెనల నిర్మాణం చేసారు. కేంద్ర ప్రభుత్వ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కింద 300 ఇళ్లకు తాగునీరు అందించడంలో సహాయం చేసింది. చాలా చోట్ల వీధి దీపాలు వెలిగించారు. పనికి రాకుండా ఉన్న ఎన్నో వీధి స్తంభాలను బాగుచేయించారు. గ్రామంలో తక్షణ అవసరాలైన విద్య, రహదారుల కోసం పనిచేయడం వీరమ్మాళ్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ గ్రామ అభివృద్దికి ఎంతో కృషి చేసింది. అయితే గ్రామంలో బలంగా ఉన్న అధికార రాజకీయాలు, పితృస్వామ్యం నుండి తప్పించుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ‘ప్రత్యర్థి నాయకులు, వారి మనుషులు గ్రామ అభివృద్ధి కోసం వీరమ్మాళ్‌ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించారు. వారి నాయకులు చాలా మంది గతంలో గ్రామ పదవుల్లో ఉన్నారు. దాంతో ఆమె అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయడానికి, ఆలస్యం చేయడానికి వారు వారి బలాన్ని ఉపయోగించుకుంటున్నారు’ అని ఒడయన్‌ చెప్పారు.
పనులను అడ్డుకుంటున్నారు
60 ఏండ్ల నాటి శిథిలావస్థలో ఉన్న గ్రామ ప్రాథమిక పాఠశాలల స్థలంలో షెడ్యూల్డ్‌ కులాల మహిళలకు మరుగుదొడ్లు, రోడ్లు, కొత్త క్యాంపస్‌లు నిర్మించాలని ఎన్నో ఏండ్ల నుండి ప్రయత్నిస్తున్నానని వీరమ్మాళ్‌ చెప్పారు. ‘గ్రామంలో చాలా పోరంబోకే భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల పరిధిలోకి రాని భూమి ఉంది. మేము దాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రతిపక్ష అభ్యర్థులు, వారి వ్యక్తులు తమ బలంతో ఈ ప్రాజెక్టులను చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. ఈ భూముల విషయంలో వారు గ్రామంలోని ప్రజలను కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు’ అని ఒడయన్‌ చెప్పారు.
పట్టువదలకుండా…
‘అన్ని చోట్లా రాజకీయాలు ఉంటాయన్నది నిజమే. అయితే ఈ వయసులో నేను కోర్టుల చుట్టూ పరిగెత్తలేనని వారికి తెలుసు. అందుకే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది’ అని వీరమ్మాళ్‌ అంటున్నారు. కానీ ఇంత వయసు వచ్చినా ఆమె తన పట్టుదలను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రతిరోజూ ఆమె ఉదయం 5 గంటలకు నిద్రలేచి, తనే స్వయంగా వంట చేసుకుంటుంది. ఆఫీసులో తన అవసరం పెద్దగా లేనపుడు పొలంలో పని చేస్తుంది. ఈ భూమిపై నా కాలం ముగిసేలోపు నా గ్రామానికి నేను చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నాను’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.