ఆ నియామకాలు చట్ట వ్యతిరేకం

– ‘కనీస వేతన మండలి’పై హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌
కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌, సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రీజనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి దగ్గులసత్యం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 149 ప్రభుత్వ, ప్రయివేట్‌ విభాగాల్లో పనిచేసే 1,07,64,788 మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు ఉన్నారని, వీళ్ల సమస్యల సాధనకు మండలి అవసరమని పిటిషనర్‌ వాదన. మండలి చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ కార్మిక సంఘ నేత పి.నారాయణను నియమించడం చెల్లదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్మిక చట్ట నిబంధనల ప్రకారం ఏ పార్టీకి, ఏ కార్మిక యాజమాన్యానికి సంబంధం లేని వాళ్లనే నియమించాలని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఉత్తర్వులు(జీవోనెం.14) ఉన్నాయని చెప్పారు. కనీస వేతనాల సలహా మండలిలో నియమితులైన సభ్యులు ఏ రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉండకూడదని తెలిపారు. రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం పరిధిలోకి వచ్చే లక్షలాది మంది కార్మికులు ఉన్నారనీ, అయితే కనీస వేతనాల సలహా బోర్డులో ఒక్క మహిళను కూడా నియమించలేదని వాపోయారు. ప్రభుత్వ కౌంటర్‌ నిమిత్తం హైకోర్టు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది
ఎప్పుడు నియమిస్తారో చెప్పండి
ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర స్థాయి కమిషన్‌కు చైర్మెన్‌, సభ్యులను ఎప్పుడు నియమిస్తారో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత విచారణ సమయంలోనే నియామకాలు చేపట్టాలని ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది. నియమకాలు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉందని, సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో సామాజిక కార్యకర్త గణేష్‌రావు మరికొందరు వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకే కేసుగా ఎందుకు పరిగణించకూడదో చెప్పండి
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అధిపతి, ఎమ్‌డీలపై ఏపీ సీఐడీ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా పెట్టిన కేసులు అన్నింటినీ ఒకే కేసుగా ఎందుకు పరిగణించరాదో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. మార్గదర్శి చైర్మెన్‌, ఎమ్‌డీలపై ఒకే తరహా కేసులను నమోదు చేయడాన్ని పలువురు హైకోర్టులో సవాల్‌ చేశారు. వీటిని జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి విచారించారు. ఏపీ సీఐడీ పోలీసుల విచారణ నిమిత్తం విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.