కొవ్వును నియంత్రించేందుకు…

To control fat...పొట్ట చుట్టూ కొవ్వు పెరిగితే చూడటానికి లావుగా కనిపిస్తాము. ఇది కాస్త ఇబ్బందిగా కనబడే సంగతి పక్కనపెడితే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒక్కసారి పొట్టి పెరిగిందంటే దాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. ఉదరంలోని అధిక కొవ్వు గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా అనేక ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని సార్లు ఈ కొవ్వును కరిగించేందుకు వ్యాయామాలు సరిపోకపోవచ్చు. వ్యాయామంతో పాటు ఆరోగ్యకర జీవనశైలి, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల కొవ్వును నియంత్రించవచ్చు. అదెలాగో చూద్దాం…
   పాలు, పాల పదార్థాలు : క్రమం తప్పకుండా పాలు తీసుకునే వారిలో కూడా కొవ్వు కాస్త ఎక్కువగానే పెరుగుతుంది. అందుకే పొట్టకొవ్వు అధికంగా వున్నవారు పాలు తక్కువగా తీసుకోవాలి. లేదంటే దానికి బదులుగా స్కిమ్‌, బాదం లేదా సోయా పాలు తాగవచ్చు.
ఆలూ చిప్స్‌ : ఆలూ చిప్స్‌ను హైడ్రోజనేటెడ్‌ నూనెలు లేదా ట్రాన్స్‌ ఫ్యాట్‌లో తయారు చేస్తారు. ట్రాన్స్‌ ఫ్యాట్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె జబ్బులకు దోహదం చేస్తుంది. బరువు పెరుగుతుంది. కాబట్టి వీటిని తగ్గించుకోవడం చాలా మంచిది.
పిండి, బియ్యం : తెల్ల పిండి పదార్థాలు ప్రాసెస్‌ చేయబడిన ఆహారాల వల్ల కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. కనుక వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర ధాన్యం తీసుకోవాలి. ఇది పొట్ట మరీ ఎక్కువగా వున్నవారి విషయంలో మాత్రమే.
చక్కెర వుండే పానీయాలు : సోడాలో చక్కెరల రూపంలో కేలరీలు ఉంటాయి. సోడా, ఇతర కార్బోనేటేడ్‌ చక్కెర పానీయాలు జీవక్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఈ పానీయాలు శరీరంలో కొవ్వును నిల్వ చేస్తాయి. కాబట్టి చక్కెర శాతం ఎక్కువగా వుండే పానీయాలకు వీలైనంత దూరంగా వుండాలి.
ఫాస్ట్‌ ఫుడ్‌, వేపుళ్ళు : ఫాస్ట్‌ ఫుడ్‌, వేయించిన ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు లేదా ఫైబర్‌ చాలా తక్కువగా వుంటాయి. అవి సోడియం, ట్రాన్స్‌ కొవ్వులతో నిండి వుంటాయి. ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. వీటిని వెంటనే మానుకోవాలి.
సోడియం అధికంగా ఉండే ఆహారాలు : 90 శాతం మంది ప్రజలు ప్రతిరోజూ 2,300 మిల్లీగ్రాముల సోడియం కంటే దాదాపు ఎక్కువగా తీసుకుంటారు. సోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఎక్కువ నీటిని నిలుపుకుంటుంది. ఫలితంగా లావవుతున్నట్టు కనిపిస్తారు. కనుక వ్యాయామంతో పాటు పైన చెప్పిన పదార్థాలను కాస్త దూరం పెడితే పొట్ట చుట్టూ పెరిగే కొవ్వును నియంత్రించవచ్చు.