గుర్తింపు రావాలంటే..?

To get recognition..?ఆఫీసులో గుర్తింపు రావాలని కోరుకోనిదెవరు. ఆలోచనలు, కష్టపడేతత్వం ఉన్నా అభిప్రాయాలు చెప్పడానికి సంశయించే మహిళలు ఎక్కువ. ఈ తీరే వారిని వెనుకబడేలా చేస్తున్నాయంటున్నాయి అధ్యయనాలు…మరి మీరలా కావొద్దంటే..
విద్యార్ధి దశ వేరు, ఉద్యోగం వేరు. ఇక్కడా అందరూ వచ్చి మిమ్మల్ని కలుపుకొని వెళ్లాలని ఆశించొద్దు. ఎవరైనా ఒక ఆలోచన చెప్పారు. కానీ దానివల్ల నష్టాలే ఎక్కువ లేదా కొంచెం మార్పు చేసే మరింత లాభం పొందొచ్చు. ‘నా ఆలోచన కాదు కదా’ అన్న తీరు దాటి చెప్పండి. మీలోని సమస్యా పరిష్కార నైపుణ్యాలను బయటపెట్టే అవకాశమిది.
ఒక్కొక్కరి పని వేగం ఒక్కోలా ఉంటుంది. ‘నా పని నేను చేశా చాలు’ అని ఊరుకోవద్దు. మీ పని మీరు సరిగా చేస్తే మంచిదే. కానీ, అదే సరిపోదు. జూనియర్లు పని అర్థం కాకో, సీనియర్లు సకాలంలో ప్రాజెక్టు పూర్తవకో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు వారికి సాయం చేయండి. మీలోని నాయకురాలిని పరిచయం చేసినవారు అవుతారు. అందరూ మెచ్చే సహోద్యోగినీ అవుతారు.
కొంతమంది బాగా పని చేస్తారు. కానీ మీటింగ్‌ల్లో మాట్లాడటానికి వచ్చే సరికి భయపడతారు. ఇబ్బంది చెప్పడానికి ఇంకా వెనుకాడతారు. దీంతో పనిభారం పెరుగుతుంది. అసలే మనకు ఇంటి బాధ్యతలు అదనం. ఇంట్లోలా అన్నీ చేసుకుంటూ వెళితే పెరిగితే ఒత్తిడే! గడువులోగా పని పూర్తవదు. ఎవరైనా సహకరించట్లేదు. సమస్య ఏదైనా పైవాళ్ల దృష్టికి తీసుకెళ్లండి. అసలు పరిస్థితి తెలిసినప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది.
తక్కువ అంచనా వేస్తారనో, ఇది కూడా తెలియదా అంటారనో మనలో చాలామంది సందేహాలు అడగడానికి భయపడతారు. తీరా పనిలో పొరపాట్లు దొర్లితే అదింకా ప్రమాదం కదా! కాబట్టి అడిగేయండి. అలాగే నేను చేసిందే ఫైనల్‌ అన్న తీరూ పనికిరాదు. ‘బాలేదు, ఇక్కడ మార్పులు చేస్తే మంచిది’ అన్న సలహాలొస్తే తీసుకోండి. మార్పులు చేర్పులకు సిద్ధంగా ఉంటేనే తుది ఫలితం కూడా బాగుంటుంది. అవసరమైన చోట మాట్లాడుతూ.. సాయం కోరుతూ వెళ్లండి. బృందంలో ప్రధాన వ్యక్తుల జాబితాలో మీ పేరు ఉండటం ఖాయం.