– ఆ ఐఏఎస్‌ను బెదిరించారు
– మహారాష్ట్ర సర్కార్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం
– తాను అక్కడ కాలు పెట్టాకే విద్యుత్ కోతలు ఎత్తేశారంటూ వ్యాఖ్య
– బీఆర్ఎస్ భయంతో బీజేపీ తోకముడిచిందని ఎద్దేవా
– సీఎం సమక్షంలో షోలాపూర్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ మోడల్‌ను మహారాష్ట్రలో అమలు చేయాలంటూ కేంద్రేకర్ అనే ఐఏఎస్ అధికారి అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలిచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అది గిట్టని మహారాష్ట్ర సీఎం, మంత్రులు ఆ ఐఏఎస్ అధికారిని పిలిపించుకుని చివాట్లు పెట్టి, బెదిరించి చివరకు ఆయనతో రాజీనామా చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మహారాష్ట్రలో అడుగు పెట్టాక అంతకు ముందున్న విద్యుత్ కోతలు ఎత్తేశారనీ, బీఆర్ఎస్ భయంతో బీజేపీ తోక ముడించిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాకు చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అంబానీకి, ఆదానీకి అప్పగించేందుకు కుట్రలు పన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లులు పెంచాలి. పొలాలకాడి మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ కేంద్రం వింత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాటని బీఆర్ఎస్ సహించబోదని హెచ్చరించారు. ప్రజలు, రైతులకున్న ఇలాంటి సమస్యలు తొలగించేందుకే బీఆర్ఎస్ మహారాష్ట్రలో కాలు మోపిందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు పాల్గొన్నారు.