అమ్మ సమాజ నిర్మాత అంటారు. అది నిజం చేస్తున్న భారతీయ మహిళలు ఎందరో ఉన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటుగా ఆర్ధికంగా కూడా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాలలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి మహిళలలో ప్రియాంక తాయి ఒకరు. ‘కుల స్టూడియో’ పేరుతో ఓ సంస్థ స్థాపించి అమ్మలకు ఉపాధి కల్పిస్తున్నారు. బట్టల వ్యర్థాలతో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో… ప్రియాంక పుట్టింది హైదరాబాద్. అయితే పెరిగింది ముంబై, వృత్తి విద్యలను అభ్యసించింది బెంగళూరులో. ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్. 2008లో ఓ సంస్థలో అపారల్ డిజైనర్‌గా తన ప్రొఫెషన్‌ను మొదలుపెట్టారు. 2011 నాటికి ‘కుల స్టుడియో’ పేరిట సొంత సంస్థను స్థాపించే స్థితికి ఎదిగారు. ఒక బిడ్డగా, భారత నౌకాదళ ఉన్నతాధికారికి భార్యగా, ఇద్దరు ఆడపిల్లల తల్లిగా, కోడలిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే ‘కుల స్టూడియో’ క్రియేటివ్ డైరెక్టర్‌గా తన సంస్థ ఎదుగుదల కోసం కృషి చేస్తూ తన గమనాన్ని సాగిస్తున్నారు ప్రియాంక.
మిగిలిన సంస్థలకు భిన్నంగా
‘కుల స్టుడియో’ మిగిలిన అన్ని ఫ్యాషన్ సంస్థలకు భిన్నమైన ఆలోచనతో మొదలు పెట్టారు. ఆర్థికంగా సంపన్నమైన కుటుంబంలో జన్మించినా పొదుపుపై చక్కని అవగాహన ఉన్న వ్యక్తి ఈమె. ఏదీ వృధా కారాదు అన్న ఆలోచనతో ‘కుల స్టూడియో’ మొదలు పెట్టారు. వినూత్న ఆలోచనతో అభివృద్ధి చెందిన ఆ సంస్థ 2021లో టాప్ 40 స్టార్టప్స్‌లో స్థానం దక్కించుకుంది. ఇది తనకెంతో గర్వకారణం అంటారు ఆమె. ‘మనం కట్టుకునే బట్టలు మన ఆలోచనకు, మన నమ్మకాలకు, మన ఇష్టాఇష్టాలకు సంబంధించిన విషయాలు ఎవరికి నచ్చిన విధంగా, వారి శరీరాకృతికి తగినట్టు, అందుకు అనుగుణంగా బట్టలు తయారు చేయించి ఇవ్వడం మా ప్రత్యేకం’ అని నమ్మకంగా చెప్తున్నారు ప్రియాంక.
వాతావరణ కాలుష్యంతో పాటు
టెక్స్టైల్ మిల్స్‌లో మిగిలి వృధాగా పడి ఉన్న వస్త్రాలను, నచ్చినా కట్టుకోవడానికి వీలులేక ఇంట్లో అనవసరంగా పడి ఉన్న వస్త్రాల నుండి ఆధునిక డిజైనర్, సాంప్రదాయ దుస్తులను తయారు చేయడం కుల స్టూడియో ఉద్దేశం. ఫ్యాషన్ పొల్యూషన్‌ను తగ్గించి బట్ట లైఫ్‌ను పెంచడం తన లక్ష్యంగా పెట్టుకున్నారు ఆమె. ‘ఇలా వ్యర్థ పదార్ధాల వల్ల జరిగే వాతావరణ కాలుష్యంతో పాటు ఇతర నష్టాలను కూడా తగ్గించగలం. అందుకే వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. నా భర్త, సంస్థ సభ్యులు నాకు ఎంతో సహాయ సహకారాలు అందిసున్నారు. లేకపోతే ఈ ప్రయాణం ఇంతకాలం కొనసాగేది కాదు’ అంటున్నారు.
ట్రెండ్ మారుతూ ఉంటుంది
‘కోవిడ్-19 వంటివి మనం ఇంతకు ముందు ఊహించలేని విధంగా సమాజాన్ని ప్రభావితం చేయగలవు. కాబట్టి ఇప్పటి నుండి 100 ఏండ్ల వరకు ఫ్యాషన్ అనేది మనం అంచనా వేసిన దానికంటే పూర్తి భిన్నంగా ఉండవచ్చు. మాస్కులు ధరించడం తప్పనిసరి అవుతుందని, అది ప్రపంచ వ్యాప్తంగా ప్రజల వార్డ్రోబ్ లలో ప్రధానమైనదిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. అయితే భవిష్యత్తులో మన దుస్తులు ఎలా ఉంటాయో మనం ఊహించగలం. దుస్తులు ధరించడంలో సాంకేతికత కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనకు తెలుసు. ట్రెండ్లు నిరంతరం మారుతూ ఉంటాయి. సాంకేతికత పెరుగుతూనే ఉంటుంది. ఫ్యాషన్ పరిశ్రమ దుస్తులతో ప్రత్యేకమైన, బోల్డ్, టెక్-ఆధారిత ప్రభావాన్ని చూపుతుంది. గత పదేండ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళల శ్రామికశక్తి వేగంతో పెరుగుతోందని డేటా చెబుతోంది. ఆన్లైన్ వ్యాపారాలు చేస్తున్న మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అలాగే నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా స్వతంత్రంగా ఉంటున్నారు’ అంటున్నారు ఆమె.
మహిళలకు అవగాహన ఎక్కువ
‘స్త్రీలు స్వతహాగా నాయకులు. సామాజిక స్పృహ, విషయాల పట్ల అవగాహన రెట్టింపు వుంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళా నాయకత్వం సంస్థలపై సానుకూల ప్రభా వాన్ని చూపుతుందని నిరూపించబడింది. మహిళా నాయకత్వం ఉన్న కంపెనీలు లాభదాయకంగా, కొత్త ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతున్నాయి. టెక్నాలజీ సహకారంతో ఎక్కువ మంది మహిళలు ఫ్యాషన్ పరిశ్రమలో వ్యవస్థాపకలుగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఫ్యాషన్ ఆవిష్కరణకు సాంకేతికత సాయంతో పనిచేసే మహిళలపై మనం శ్రద్ధ వహించాలి. చాలా మంది మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను చేసినట్లుగా మహిళా కస్టమర్ కోసం ఫ్యాషన్, టెక్నాలజీని మిళితం చేసే కొత్త వ్యవస్థాపక భావనలను రూపొందిస్తున్నారు’ అంటూ ప్రియాంక తన అనుభవాలను పంచుకుంటున్నారు.
అమ్మలకే ప్రాధాన్యం
ఎంత మంచి ఆలోచన అయినా ఈ వ్యాపారంలో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. దాంతో ఇన్వెస్టర్ల నమ్మకం సంపాదించడం, ఫండ్స్ ఏర్పాటు చేసుకోవడం ప్రియాంకకు మొదట్లో చాలా కష్టమయింది. ఎంతో ఓపికతో ఈ సమస్యలన్నీంటినీ పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తన కుల స్టూడియో ద్వారా ఎంతో మంది మహిళలకు చేయూతనిస్తున్నారు. ముఖ్యంగా తల్లులు అయిన తర్వాత తిరిగి ఉద్యోగం ప్రారంభించాలనుకుంటున్న మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విధంగా మహిళా సాధికారతకు తన వంతు కృషి చేస్తున్నారు. అంతేకాదు సంస్థలో పని చేసే మహిళలకు తమకు అనుకూలమైన సమయంలో పని చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. అలాగే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక రెస్ట్ రూములు, వాళ్ళ పిల్లలకు క్రెచ్ కూడా ఏర్పాటు చేసి వారికి అన్ని సదుపాయాలను సమకూరుస్తున్నారు.
– బి. లావణ్య, 8184897897