నేడు గాంధీ ఆస్పత్రిలో ….

– మాతా, శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ మాతా, శిశు ఆరోగ్య కేంద్రం ఆదివారం నుంచి సేవలనందించనున్నది. ఆదివారం ఉదయం 11.15 గంటలకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు దీనిని ప్రారంభించనున్నారు. ఒకటిన్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బ్లాకులు, ఏడంతస్తుల్లో అన్ని డిపార్ట్‌ మెంట్లను దీంట్లో ఏర్పాటు చేశారు. ఓపీ, ఓపీ ల్యాబ్‌, ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్లు, ప్రసవ కేంద్రాలు, 36 లేబర్‌ డెలివరీ, రికవరీ రూములు, ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత తల్లి బిడ్డల కోసం 120 పడకలు, సమస్యలు ఎదురయ్యే పిల్లల కోసం నియోనాటల్‌ ఐసీయూ, ఇన్‌ బార్న్‌, అవుట్‌ బార్న్‌, ఎస్‌ఎన్‌ సీయూలు బేబీ వార్మర్స్‌, ఫోటోథెరపీ మిషన్లతో పాటు మదర్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుచేశారు.
సీరియస్‌ ఉన్న గర్భిణీల కోసం మెటర్నల్‌ ఐసీయూ, శస్త్రచికిత్సల అనంతరం తల్లుల కోసం 48 పడకలున్నాయి. ఎంఐసీయూలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదురయ్యే తల్లులు, శిశువుల కోసం డయాలసీస్‌ సౌకర్యంతో పాటు ఆర్‌ఓ ప్లాంట్‌ ను ఏర్పాటు చేశారు.