నేడు జాతీయ వైద్యుల దినోత్సవం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వారు ఫ్రంట్‌లైన్‌ వారియర్లు. కరోనా కాలంలో వారి విలువ మరింతగా తెలిసి వచ్చింది. రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా వైరస్‌పై జరిగిన యుద్ధం చేసి మానవాళిని కాపాడిన త్యాగధనులు. ఆ యుద్ధంలో ప్రాణాలను సైతం కోల్పోయిన వారెందరో. ఇంట్లో మనుషులే దగ్గర ఉండేందుకు ఇబ్బంది పడిన క్షణాలవి. అలాంటిది వేలాది మంది కరోనా రోగుల మధ్య నడుమ గడిపిన వీరత్వం వారిది. అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా హాయిగా జీవించేందుకు నిరంతరం ప్రజారోగ్య పరిరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్లను గుర్తించి, ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది జూలై ఒకటో తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వైద్యరంగంలో విశేష సేవలందించిన డాక్టర్‌ బిధాన్‌ చంద్రరారు జయంతి, వర్థంతిని పురస్కరించుకుని జూలై ఒకటో తేదీన నేషనల్‌ డాక్టర్స్‌ డే నిర్వహిస్తున్నారు. ఆయన 1882 జూలై ఒకటో తేదీన జన్మించారు. 1962 జూలై ఒకటో తేదీన మరణించారు. పశ్చిమబెంగాల్‌ రెండో ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1961 ఫిబ్రవరి నాలుగున కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. ప్రతి ఏడాది జూలై ఒకటో తేదీన ఆయా డాక్టర్ల సంఘాలు వివిధ కార్యక్రమాలతో తమ సేవలను గుర్తుచేసుకుంటున్నారు.
భగవంతునితో సమానుడిగా, అంతటి వాడిగా సమాజంలో డాక్టర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రజావైద్యులపై దాడుల పెరిగిపోతున్నాయి. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో తాము రోగులకు సేవలందిస్తున్నామని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన భద్రత కల్పించాలని కోరుతున్నారు.