నేడు, రేపు ఐలూ రాష్ట్ర 3వ మహాసభ

హాజరుకానున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌ రెడ్డి
పాల్గొననున్న 400 మంది ప్రతినిధులు
నవతెలంగాణ – భువనగిరి
ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర 3వ మహాసభ ఈనెల 17, 18వ తేదీల్లో భువనగిరిలోని దీప్తి నూతన హోటల్లో జరగనుంది. ప్రారంభ సభకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌ రెడ్డి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్‌ హాజరుకానున్నారు. 18వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భుయన్‌, బార్‌ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఏ.నరసింహారెడ్డి హాజరు కానున్నారు.
సభకు ముస్తాబైన ప్రాంగణం
దీప్తి హోటల్‌ ఏ.అనంతరెడ్డి నగర్‌లోని కొండపల్లి ఉత్తమ్‌ కుమార్‌ హాల్‌లో రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నారు. ముందుగా సీనియర్‌ న్యాయవాది కొత్త బుచ్చిరెడ్డి మహాసభ కాన్ఫరెన్స్‌ పతాకాన్ని ఎగురవేస్తారు. మహాసభ ఏర్పాట్లలో 10 రోజులుగా రాష్ట్ర అధ్యక్షులు జె.విద్యాసాగర్‌, ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ, యాదాద్రి భువనగిరి జిల్లా ఆహ్వాన సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి వెంకట్‌ రెడ్డి, ఎండి.ఇస్మాయిల్‌తో పాటు ఆహ్వాన సంఘం సభ్యులు భాగస్వాములయ్యారు. జిల్లాలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా న్యాయవాదులు, న్యాయవ్యవస్థ కక్షిదార్ల సమస్యల పరిష్కారం కోసం అఖిలభారత న్యాయవాదుల సంఘం ఏర్పడిందని ఐలూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడి వెంకటరెడ్డి, ఎండి.ఇస్మాయిల్‌ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. ఈనెల 17న ఉదయం 10 గంటలకు రాష్ట్ర మహాసభ ప్రారంభం కానుంద న్నారు. న్యాయవాదులు సకాలంలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. 400 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్టు చెప్పారు.
గడిచిన మూడేండ్ల కార్యకలాపాలను సమీక్షించుకొని.. రానున్న మూడేండ్ల కర్తవ్యాలను సభలో రూపొందిస్తా మన్నారు. న్యాయవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని, మృతిచెందిన న్యాయవాది కుటుంబానికి రూ.ఆరు లక్షలు చెల్లించాలని, న్యాయవాదులు అందరికీ ఇండ్ల స్థలాలు ఉచితంగా లేదా కనీస ధరకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్టు చెప్పారు. న్యాయవాదులకు ఇన్సూరెన్‌తో హెల్త్‌ కార్డులు జారీ చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పూర్తిస్థాయిలో కోర్టులు ఏర్పాటు చేసి భవనాలు నిర్మించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. న్యాయాధికారులు న్యాయశాఖ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ న్యాయవాదులకు గవర్నమెంట్‌ లీడర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, బ్యాంకు, ఇన్సూరెన్స్‌ కంపెనీల స్టాండింగ్‌ కౌన్సిల్‌ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వీటన్నింటిపై రాష్ట్ర మహాసభలో చర్చించనున్నట్టు చెప్పారు.