అత్తాకోడళ్లు అంటే ఎక్కువ శాతం బద్దశత్రువులన్నట్లు మెలుగుతుంటారు. ఉమ్మడి కుటుంబాలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఆ ప్రభావమేనేమో ఈ రోజుల్లో ఎక్కువ శాతం చిన్న కుటుంబాలుగా ఎవరి బాధ్యతల్లో వారు మునిగిపోయి ఉన్నారు. అయితే అందరూ ఏదొక సందర్భంలో ఒకే దగ్గర గడపాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అర్థం చేసుకుని, అనునయంతో మెలిగితే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కానీ ఎవరికి వారు నాకెందుకు అనే ధోరణి పెరిగిపోతోంది. అలా కాకుండా కలిసి ఉన్న సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే, సంబంధాలు, ప్రవర్తన ఎలా వుండాలో తెలుసుకుందాం…
అత్త అనగానే చాలామంది కోడళ్లు అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. పెండ్లయి ఆమె ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి కోడలి పట్ల అత్తలూ అలాగే ఉంటారు. మనసుండాలే కానీ అత్త పట్ల కోడలు, కోడలి పట్ల అత్త ఆప్యాయతలు చూపించడం పెద్ద కష్టమైన విషయమేమీకాదు. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవిస్తూ, ఒకరి పట్ల మరొకరు స్నేహంగా మసలుకుంటే అత్తాకోడళ్ల బంధం కూడా ఎన్నో మధురానుభూతులను పంచుతుంది.
పరిమితులు ఎరిగి ప్రవర్తించాలి
కుటుంబంలో అత్త పాత్ర చాలా ముఖ్యమైంది. అయితే అత్త మీద వచ్చినన్ని విమర్శలు మరే సంబంధంలోనూ కనబడవు. కొడుకు, కోడలు, తల్లి… ఈ ముగ్గురి మధ్య సాగే బంధంలో ప్రతి ఒక్కరూ తమ పరిమితులు ఎరిగి ప్రవర్తించాలి. కోడలి వల్ల కొడుకు తనకు ఎక్కడ కాకుండా పోతాడోననే భయం, సందేహాల వంటివి తల్లిని చుట్టుముడతాయి. దాంతో కోడలి మీద ఆధిపత్య ధోరణి చూపిస్తుందామె. కోడలి పరిస్థితి కూడా అంతే. భర్తను తన నుంచి అత్త దూరం చేస్తుందేమోనని ఆమె పట్ల వ్యతిరేక భావాన్ని కోడలు పెంచుకుంటుంది.
పరస్పర అవగాహన అవసరం
ఇలాంటి సమస్యల మధ్య అత్తాకోడళ్ల బంధం సవ్యంగా సాగాలంటే వారి మధ్య పరస్పర అవగాహన ఎంతో అవసరం. అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇద్దరూ వాళ్ల మనసులోని మాటల్ని ఒకరితో ఒకరు స్వేచ్ఛగా పంచుకోవాలి. కుటుంబం మొత్తం కలిసి గడిపేటప్పుడు అత్తను కూడా కోడలు ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలి. ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసు కోవాలి. ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా ఏమైనా చేయాలి. అప్పుడే ఆ ఇద్దరి మధ్య పటిష్టమైన స్నేహబంధం పెంపొందుతుంది. అప్పుడు అత్తకు కోడలంటే కోపం ఉండదు. కోడలూ అభద్రతా భావానికి లోనుకాదు.
పోటీతత్వం వద్దు
కోడలిపట్ల కోపాన్ని, అసూయను పెంచుకోవడం వల్ల అత్తకు ఒరిగేదేమీ లేదు. అలాగే తన అతిప్రేమతో కొడుకును, కోడలిని కూడా తల్లి ఇబ్బంది పెట్టకూడదు. చాలా సందర్భాలలో అత్తాకోడళ్ల మధ్య ఉన్న పోటీతత్వం వల్ల కాపురాలు ఛిన్నాభిన్నమౌతున్నాయి. కొడుకు విషయంలో తల్లి ఓవర్ ప్రొటెక్టివ్‌గా వ్యవహరిస్తుంటుంది. తను లేకపోతే తన కొడుకు ఏమీ చేసుకోలేడు, తినలేడు, ఉండలేడు అనుకుంటుంది. పెండ్లయిన తర్వాత కొడుకు మనసులో తన స్థానం ఎక్కడ పోతుందోననే భయం కూడా తల్లిని చుట్టుముడుతుంది. కానీ ఇలాంటి సందర్భాల్లోనే తల్లులు విజ్ఞతతో, వివేకంతో మసలుకోవాలి. కొడుకును పెంచి పెద్ద చేయడం, విద్యాబుద్ధులు చెప్పించడం, మంచి, చెడుల విచక్షణ నేర్పించడం, కుటుంబాన్ని నడిపించేలా తీర్చిదిద్దడం వరకే తన బాధ్యతని గ్రహించాలి. అంతే కాదు ఏదో ఒకరోజు వేరే స్త్రీని పెండ్లి చేసుకుని తనదైన కుటుంబ జీవితాన్ని కొడకు ఏర్పరచుకుంటాడని, అతడి కుటుంబ వ్యవహారాల్లో తను తలదూర్చకూడదని ఆమె గ్రహించాలి. అలాగే కోడలు కూడా తన భర్తను పెంచి పెద్దచేసిన తల్లికి ఇచ్చే ప్రాధాన్యతలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి. అత్తకు తగిన గౌరవం కచ్చితంగా ఇచ్చి తీరాలి. ఆ గౌరవాన్ని అత్త తన పెద్దరికంతో, అనుభవంతో నిలబెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలూ వుండదు.
ప్రతి పనినీ విమర్శించకూడదు
కొడుకు, కోడలు జీవితాల్లో అత్త కలగజేసుకోకూడదు. ఇలా చేసుకోవడం వల్ల చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్య కీచులాటలు మొదలవుతాయి. అలాగే కోడలు చేసే ప్రతి పనిని అత్త విమర్శించడం వల్ల కూడా అత్తాకోడళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరతాయి. అయినదానికి కానిదానికీ విమర్శించే గుణం వల్ల అత్తంటే కోడలికి పడని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే అత్త, కోడలు, కొడుకు ఈ ముగ్గురూ తమ తప్పొప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు సాగితేనే వారి మధ్య బంధం బలపడుతుంది. ఆదిపత్యం చూపించాలనుకుంటే మాత్రం శత్రువులుగా మిగిలిపోతారు.