జాడలేని నైరుతీ..

– ఏరువాక దాటి 15 రోజులు
– చినుకు కోసం రైతన్న ఎదురుచూపు
– పత్తి, మొక్కజొన్న నాటిన రైతుల్లో ఆందోళన
– వర్షాలు పడ్డాకే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచన
నైరుతి రాలేదు.. వర్షాల జాడ లేదు..
వానాకాలం అదును దాటుతోంది. జూన్‌ మొదటి వారంలోనే పలకరించాల్సిన నైరుతి వాన జల్లులు ఇంకా రాష్ట్రానికి చేరుకోలేదు. ఖరీఫ్‌(వానాకాలం) కూడా జూన్‌ మొదటి వారం నుండే మొదలవుతుంది. ప్రభుత్వం రెండు వారాల ముందే ఖరీఫ్‌ పనులు మొదలు పెట్టుకోవాలని సూచనలు చేసినా ఉష్ణోగ్రతలు 43డిగ్రీలకు తగ్గకుండా నమోదవుతున్నాయి. సాధారణంగా మృగశిరలోపే విత్తనాలు నాటుకునే రైతుల్లో చాలా మంది పది రోజుల కిందటే పత్తి, మొక్కజొన్న విత్తుకున్నారు. వర్షాలు లేక వేసిన విత్తనాలు మొలవక ఆందోళనలో పడ్డారు. ఒక్కో రైతు సుమారు రూ.50వేల మేరకు పెట్టుబడి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గతేడాది తొమ్మిదేండ్ల కాలంలో ప్రతి జూన్‌ మొదటి వారంలోనే కురిసిన వర్షాలు ఈ ఏడాది 17వ తేదీ దాటినా జాడ లేవు. ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జారు తుపాన్‌ ప్రభావంతో నైరుతి పవనాల పయనం మందకొడిగా మారిందని చెబుతున్న వాతావరణ శాఖ మరో మూడ్రోజులూ తీవ్రమైన ఎండలు తప్పవని హెచ్చరించడం గమనార్హం.
ఆరెకరాల్లో మొక్కజొన్న వేశా..
ఆరెకరాల్లో మొక్కజొన్న నాటిన. ఇప్పటికీ వానలు పడటం లేదు. డ్రిప్‌ ద్వారా కొంతమేర నీళ్లందించగలం. అయినప్పటికీ వర్షాలపై ఆధారపడి వేసిన సుమారు 4 ఎకరాల వరకూ మొక్కజొన్న విత్తులు మొలకెత్తే పరిస్థితి లేదు.
వెల్మ తిరుమల్‌రెడ్డి, మంగళంపల్లి, చొప్పదండి మండలం
వర్షాలు వచ్చాకే సాగు ప్రారంభించాలి
ప్రస్తుతం నైరుతి మందకొడిగా సాగుతున్నట్టు వాతావరణశాఖ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు వర్షాలు మొదలయ్యాకనే విత్తనాలు వేసుకోవాలి. ముందుగా వేసుకుని వర్షాలు రాకపోతే పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉంది.
వి.శ్రీధర్‌, కరీంనగర్‌ జిల్లా వ్యవసాయాధికారి
రెండ్రోజుల్లో వర్షం పడకపోతే..
మూడెకరాల్లో పత్తి విత్తనాలు వేసిన. ఇప్పటికి పది రోజులు దాటింది. ఎండలేమో తగ్గడం లేదు. రెండ్రోజుల్లో వర్షాలు పడకపోతే వేసిన విత్తులు మొలవవు. దుక్కులు, విత్తనాలు, కూలీల ఖర్చు కలుపుకుని పెట్టిన రూ.40వేల పెట్టుబడి దక్కేలా లేదు.
వేల్ముల మల్లేషం, దేశరాజుపల్లి, రామడుగు మండలం, కరీంనగర్‌ జిల్లా
విత్తనాలు ఎండిపోతున్నరు..
ఇంకా వానలు పడటం లేదు. ఎండలేమో దంచికొడుతున్నరు.. మూడెకరాల్లో పత్తి వేసి రూ.50వేలు ఖర్చు చేశా. ఇప్పుడు వర్షాలు పడకపోతే వేసిన విత్తనం ఎండిపోయి.. పెట్టిన పెట్టుబడి మట్టిపాలయ్యేలా ఉంది.
బాపురెడ్డి, మర్రిగడ్డ, చందుర్తి మండలం, రాజన్నసిరిసిల్ల
43డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ –కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 1.54 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయన్నది ప్రభుత్వ అంచనా. అందులో వరి పంటే గణనీయంగా ఉన్నా… పత్తి, జొన్న, కందులు, రెడ్‌గ్రామ్‌లు, కూరగా యలు, తదితర పంటలు కూడా మన రైతులు సాగు చేస్తున్నారు. కానీ వర్షాల జాడ లేకపోవడంతో సాగు అదును తప్పుతోంది.
43డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతలు
మృగశిరకార్తె దాటుతున్నా.. చినుకురాలడం లేదు. పైగా ఎండలు ఇప్పుడు కూడా 43డిగ్రీల వరకు కొడుతున్నాయి. కొన్నిచోట్ల(ఖమ్మం, జగిత్యాల, కొమురంభీమ్‌) 44 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. 11 జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో 41 డిగ్రీలపైనే ఎండలు ఉన్నాయి. కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈనెల 8న కేరళను తాకిన నైరుతి ఇంకా మందకొడిగానే సాగుతోంది.
బిపోర్‌జారు తుపాను ప్రభావమే!
ఈ నెల 8న కేరళను తాకిన నైరుతి క్రమంగా తమిళనాడుతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు విస్తరించింది. అయితే వీటి వేగానికి బంగాళాఖాతంపై నెలకొనే వాతావరణ పరిస్థితులే కీలకంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జారు తుపాన్‌ ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడిందని వాతావరణశాఖ చెబుతోంది. సాధారణంగా జూన్‌ రెండో వారం తరువాత తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు ఇంకా 44డిగ్రీలు దాటుకునే నమోదవడం ఇందుకు కారణమని చెబుతోంది. మరోవైపు పదేండ్ల రికార్డును పరిశీలిస్తే 2016, 2019 సంవత్సరాల్లో జూన్‌ 11న వర్షాలు మొదలైతే మిగిలిన సంవత్సరాల్లో జూన్‌ 4లోపే వానలు పడ్డాయి. ఈసారి జూన్‌ 16దాటినా ఇంకా ఎండలు భగ్గుమంటుండటంగమనార్హం.
వర్షాలు రాకపోతే పెట్టుబడి నష్టమే!
సాధారణంగా జూన్‌ 10 నుంచి 25 వరకు మృగశిరకార్తెగా పరిగణిస్తారు. ఈ సమయంలోనే పత్తి, మొక్కజొన్న, ఇతర పప్పుధాన్యాల విత్తనాలు నాటుకుంటారు. వరినార్లు కూడా ఈ సమయంలోనే పోస్తారు. అందులోనూ పత్తి విత్తనాలు జూన్‌ మొదటి వారం నుంచి జూన్‌ 15వ తేదీ వరకు నాటుకుంటారు. ఇప్పుడు వర్షాబావంతో బోర్లు, బావుల కింద సాగు చేస్తున్న రైతుల్లో కూడా చాలా మంది పత్తి, మొక్కజొన్నసాగు మొదలుపెట్టారు. ఇక బోరుబావుల కింద సాగయ్యే మెట్టప్రాంతాల్లో చాలా వరకు పది రోజుల కిందనే పత్తి విత్తనాలు వేశారు. అదును దాటి పంట చేతికొచ్చే సమయానికి చీడపీడలు ఉంటాయన్న భయంతోనూ కొందరు విత్తనాలు వేస్తున్నారు. ఇలా వారం, పది రోజుల కిందనే విత్తనాలు వేసుకున్న రైతులు దుక్కి దున్నేందుకు, విత్తనాలకు, కూలీలకు కలుపుకుని ఎకరాన రూ.15వేలు ఖర్చుపెట్టారు. ఇప్పుడు వర్షాల్లేక.. నష్టం తప్పదేమోనన్న ఆందోళనలో ఉన్నారు.