– నూహ్ లో దుకాణాలు కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
– ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించాలి
– హర్యానాలోని నూనూహ్ను సందర్శించిన సీపీఐ(ఎం) బృందం
– బాధితులు కన్నీరు మున్నీరు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇటీవలి మతోన్మాద హింసకు బలైన హర్యానాలోని నూహ్లో అధికారులు అన్యాయంగా కూల్చివేసిన వ్యాపారాల యజమానులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. గురువారం సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. దుకాణాలను కూల్చివేసేందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నూహ్ లో ఇంటర్నెట్‌ను పునరుద్ధరించాలని, ప్రార్థనా స్వేచ్ఛను కూడా ఈ బృందం డిమాండ్ చేసింది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు, సీపీఐ(ఎం) ఎంపీలు వి. శివదాసన్, ఎఎ రహీం, సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు ఇందర్‌జిత్ సింగ్‌లతో కూడిన బృందం నూహ్ లోని వివిధ ప్రాంతాలను సందర్శించింది. బృంద సభ్యుల వద్ద బాధితులు కన్నీరు మున్నీరు అయ్యారు. అల్లర్లు, మైనార్టీలను ప్రభుత్వం బుల్డోజింగ్ చేసిన తరువాత నూహ్ ను సందర్శించిన మొదటి ప్రతిపక్ష పార్టీ సీపీఐ(ఎం). నూహ్ లో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీలు తెలిపారు.