డీజీపీని కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం పోలీసు శాఖలో చేపట్టిన పలు సంస్కరణలు మంచి ఫలితాలనిస్తున్నాయని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ తనను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారులతో అన్నారు. సోమవారం రాష్ట్రా నికి కేటాయించబడిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు తమ ఔట్‌డోర్‌ ట్రైనింగ్‌లో భాగంగా డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా వారినుద్ధేశించి డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం తీసుకుంటున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లటంలో ఐఏఎస్‌ అధికారుల పాత్ర కీలకమన్నారు. అందులో భాగంగానే పోలీసు శాఖలో సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేపట్టిన సంస్కరణలు ప్రజల మన్ననలను పొందాయని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.