– వీరికి శిక్షణపై పోలీసు అధికారులకు
– వారం పాటు తరగతులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కొత్తగా నియమితులవుతున్న కానిస్టేబుళ్లకు అక్టోబర్ 1 నుంచి శిక్షణను ప్రారంభించటానికి పోలీసు శాఖ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంలో రాష్ట్రంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా ట్రైనింగ్ కాలేజీలు, సిటీ ట్రైనింగ్ కాలేజీలతో పాటు ఆర్.బి.వి.ఆర్ పోలీసు అకాడెమీ సైతం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని సూచనలతో కూడిన సమాచారం నగర పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సహా సంబంధిత అధికారులకు వెళ్లినట్టు తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 16వేల మంది కానిస్టేబుళ్లు, తత్సమాన పోస్టుల కానిస్టేబుళ్ల అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహించటం, అందులో అర్హత సాధించినవారి వివరాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, వీరిలో ఎంత మందిని కటాఫ్ మార్కుల ద్వారా పోస్టులకు ఎంపిక చేసే ప్రక్రియను సాగిస్తున్న బోర్డు త్వరలోనే ఫలితాలను ప్రకటించనున్నది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖకు చెందిన ట్రైనింగ్ విభాగం అధికారులు.. రాబోతున్న కొత్త కానిస్టేబుళ్ల శిక్షణకు సంబంధించి ఏర్పాట్లను చేసుకుపోతున్నారు. అయితే, వీరి ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. వీరికి శిక్షణనివ్వటానికి గానూ రాష్ట్రవ్యాప్తంగా 64 మంది అధికారులకు ఆర్.బి.వి.ఆర్ పోలీసు అకాడెమీలో శిక్షణనివ్వనున్నారు. వీరికి ఈనెల 21 నుంచి 26 వరకు శిక్షణనివ్వడానికి పోలీసు అకాడెమీలో ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.శిక్షణ సమయంలో కొత్త కానిస్టేబుళ్లు ఏ విధంగా వ్యవహరించాలి? వారిలో ఎలాంటి క్రమ శిక్షణను కల్పించాలి? మొదలుకొని వారికి బోధించే అంశాలకు సంబంధించి కూడా ట్రైనర్స్‌కు తర్ఫీదునియ్యనున్నారని తెలిసింది. ఈ 64 మంది అధికారులను ఎంపిక చేసి పంపించే బాధ్యతను నగర పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ అప్పగించారని సమాచారం.