– హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల వివాదంపై హైకోర్టు విచారణ ఈనెల 23కి వాయిదా పడింది. అదేరోజు తుది విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. టీచర్ల బదిలీలో భార్యభర్తలకు, ఉపాధ్యాయ సంఘ సభ్యులకు అదనపు పాయింట్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ఉపాధ్యాయులు సవాల్ చేసిన వ్యాజ్యాలను సోమవారం చీఫ్ జస్టిస్ అశోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. వేలమంది ఉపాధ్యాయులు బదిలీల కోసం నిరీక్షిస్తున్నారనీ, మధ్యంతర ఉత్తర్వుల కారణంగా బదిలీలు ఆగిపోయాయనీ, బదిలీలు నిర్వహించేలా ఉత్తర్వులివ్వాలంటూ ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచంద్రరావు కోరారు. వేలమంది టీచర్ల బదిలీలతోపాటు పదోన్నతులూ ఆగిపోయాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒకచోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలను తయారు చేసిందన్నారు. అందుకే అదనపు పాయింట్లు ఇవ్వడం జరిగిందని వివరించారు. బదిలీలకు సంబంధించిన నిబంధనలను సమరించామనీ, వాటిని అసెంబ్లీ, శాసనమండలిలో ఆమోదించారని అన్నారు. నిబంధనల మార్పుపై మెమోను సమర్పించారు. ఎన్నికలు వస్తున్నందున త్వరగా విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ అఫిడవిట్ పరిశీలనకు గడువు కావాలంటూ పిటిషనర్ల న్యాయవాదులు కోరడం సరికాదన్నారు. వెంటనే విచారణ చేయాలని కోరారు. అయితే మెమో ఇవాళే ఇచ్చినందున కొంత సమయం కావాలంటూ పిటిషనర్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో ఈనెల 23న తుది విచారణ చేపడతామని డివిజన్ బెంచ్ వెల్లడించింది.
ఎమ్మెల్యే మర్రిపై నాగం పిటిషన్ కొట్టివేత
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్ధన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నాగం జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తూ సోమవారం తీర్పు చెప్పింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో మర్రి భార్య పేరిట ఉన్న వ్యాపార లావాదేవీల గురించి చెప్పలేదంటూ నాగం వేసిన పిటిషన్‌లోని అరోపణలకు ఆధారాలు చూపలేదని జస్టిస్ అనుపమ చక్రవరి తీర్పును వెల్లడించారు. ఒక కంపెనీలో మర్రి భార్య డైరెక్టర్‌గా ఉన్నారనే నాగం అభియోగాలను మర్రి లాయర్ తోసిపుచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మర్రి భార్య ఆ కంపెనీలో డైరెక్టర్ అయ్యారనీ, ఎన్నికల నాటికే కాదని చెప్పారు. ఈ వాదనలను హైకోర్టు ఆమోదించి నాగం పిటిషన్‌ను కొట్టేసింది.