ఉపాధ్యాయుల బదిలీలు,

– పదోన్నత్తుల షెడ్యూల్‌ వెంటనే ప్రకటించాలి :టీపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నత్తుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) హైదరాబాద్‌ జిల్లా కమిటీ సమావేశం సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఎం.సురేందర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రవీందర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖలో దాదాపుగా 25 శాతం వివిధ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం 2015 నుంచి విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. పదోన్నతులు, నియామకాలు చేపట్టక పోవడంతో పర్యవేక్షణ అధికారులు, ఉపాధ్యాయుల్లేక ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు రోజు రోజుకూ పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు రామానందయ్య, జిల్లా కమిటీ నాయకులు కె.సీతారామశాస్త్రి, పి.వెంకటేశ్వరప్రసాద్‌, పి.సోమిరెడ్డి, అందేకర్‌రవి, వి.కామేశ్వరి, అర్షియా ఫర్హత్‌ తదితరులు పాల్గొన్నారు.
తొలిమెట్టు శిక్షణను వాయిదా వేయాలి
టీఎస్‌టీయూ డిమాండ్‌
రాష్ట్రవ్యాప్తంగా 1-5 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు తొలిమెట్టు శిక్షణను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్‌టీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు మహ్మద్‌ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాల కారణంగా వారం రోజులకుపైగా సెలవులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు దూరమయ్యారని, వర్షాలు తగ్గి పాఠశాలలు ప్రారంభం కాగానే టీచర్లు శిక్షణ పేరుతో పాఠశాలలకు రాకపోతే ఉపాధ్యాయుల పట్లకు తల్లీదండ్రులకు విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు.