ఎన్‌పీఆర్డీ జిల్లా కార్యదర్శి రాజు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందేందుకు వికలాంగులకు యూడీఐడీ కార్డు తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని ఎన్‌పీఆర్డీ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగ రెడ్డి, జిల్లా కార్యదర్శి జెర్కోని రాజు, జిల్లా కోశాధికారి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్ అన్నారు. దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల సంక్షేమ పథకాలకు యూనిక్ డిజేబులిటీ ఐడి కార్డు తప్పనిసరి చేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయాలంటే 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి యుడిఐడి, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన వైకల్యం ధృవీకరణ పత్రంతో పాటు కేంద్రం జారీ చేసిన ప్రత్యేక వికలాంగ గుర్తింపు సంఖ్య లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ వికలాంగుల సాధికారత విభాగం, దాని అనుబంధ సంస్థలు అందించే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల వంటి పథకాల ప్రయోజనాలను పొందేందుకు యూడీఐడీ కార్డు తప్పనిసరి చేయాలని నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. 17 రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను తీసుకువస్తున్నమనే పేరుతో వికలాంగులను అనర్హులన చేసే కుట్ర జరుగుతోందన్నారు. నేషనల్ ట్రస్ట్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా అందుతున్న సేవలకు ఇలాంటి విధానాలు వికలాంగులకు పథకాలను అందకుండా చేయడమే తప్ప మరొకటి కాదన్నారు. 17 పథకాల జాబితాలో వైకల్యాలున్న విద్యార్థుల కోసం ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ వంటి వివిధ స్కాలర్‌షిపులు, ఉపకరణాల కొనుగోలు, ఉపకరణాలు అమర్చడం కోసం వికలాంగులకు సహాయం, జాతీయ సంస్థలలో చికిత్స, నేషనల్ ట్రస్ట్ కింద డే కేర్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వంటివి పొందేందుకు ఈ కార్డు అవసరం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే పంపిణీ చేసిన కార్డులు చెల్లుబాటయ్యే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 2.68 కోట్ల మంది వికలాంగులజనాభాలో, జనవరి 2022 నాటికి దాదాపు 1.74 కోట్ల మందికి వైకల్య ధృవీకరణ పత్రాలను జారీ చేసినట్లు 2021-22 నాటి కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, వికలాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికనులో పేర్కొన్నారన్నారు.