ఆ మాటలు భరించలేక…

Can't bear those words...అప్పటి వరకు పుట్టింట్లో పెరిగిన అమ్మాయిలకి పెండ్లి తర్వాత అత్తింట్లో వాతావరణం కాస్త కొత్తగా ఉంటుంది. దాన్ని అలవాటు చేసుకోవడానికి కాస్త సమయం పట్టడం సహజం. అయితే అక్కడి పరిస్థితులు తాను పెరిగిన వాతావరణానికి పూర్తి భిన్నంగా ఉంటే మాత్రం కొన్ని సమస్యలు తప్పవు. వాటిని భరించడం కాస్త కష్టమే. అలాంటి ఇబ్బందులనే కొన్ని ఏండ్లు భరించి ఇక ఓపిక లేక చివరకు ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది పల్లవి. అసలు ఆమె అక్కడ ఎదుర్కొన్న సమస్యలేంటో ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
పల్లవికి 28 ఏండ్లు ఉంటాయి. ముగ్గురు అన్నలు, తండ్రి లేడు. చెల్లెల్ని అన్నలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళు ఉండేది పోలీస్‌ క్వార్టర్స్‌లో. దాంతో చుట్టు పక్కల వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో కూడా ఎప్పుడూ ప్రశాతంగా ఉంటుంది. చుట్టూ అందరూ చదువుకున్న కుటుంబాలే. అందరూ ఎంతో పద్ధతిగా ఉంటారు. ఇంట్లో ఒకరినొకరు గౌరవించుకుంటారు. అలాంటి వాతావరణంలో పెరిగిన పల్లవి ఎంబీఏ పూర్తి చేసింది. తర్వాత అన్నలు ఆమెకు పెండ్లి చేయాలనుకున్నారు.
నందు సంబంధం వచ్చింది. అబ్బాయి ఉద్యోగంతో పాటు బిజినెస్‌ కూడా చేస్తున్నాడని చెప్పారు. తండ్రి గవర్నమెంట్‌ ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు, పెన్షన్‌ వస్తుంది. సొంత ఇల్లు దానికి అద్దె 40వేల వరకు వస్తుందని చెప్పారు. అయితే నందు తల్లి తన చిన్నతనంలోనే చనిపోవడంతో తండ్రి రెండో పెండ్లి చేస్తున్నాడు. ఇదేమీ వాళ్ళకు పెద్ద సమస్యగా అనిపించలేదు. మంచి సంబంధం, చెల్లెలు సంతోషంగా ఉంటుందని అన్నలు పెండ్లి చేశారు.
పెండ్లి చేసుకుని పల్లవి ఆ ఇంట్లో అడుగు పెట్టింది. వెళ్ళిన వారంలోనే అక్కడి వాతావరణం ఆమెకు చాలా కొత్తగా, వింతగా అనిపించింది. మామ రెండో భార్యను అస్సలు గౌరవించడు. ఆమెకు ఎవరూ లేదు. అనాథను చూసి కావాలని పెండ్లి చేసుకున్నారు. ఆ ఇంట్లో పేరుకు మాత్రమే ఆమె భార్యగా, తల్లిగా ఉంటుంది. కనీసం ఆమెను ఓ మనిషిగా కూడా చూడరు. ఆమె కూడా ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడదు. పొరపాటున ఎప్పుడైనా మాట్లాడితే విపరీతమైన బూతులు తిడితూ కొడతాడు మామ. ఇదంతా పల్లవికి నచ్చలేదు. అలాంటి వాతావరణంలో పెరిగిన నందు కూడా అలాగే తయారయాడు. అంతే కాదు పెండ్లికి ముందు ఉద్యోగం ఉందని చెప్పిన మాట కూడా అబద్ధం అని తెలిసింది. పైగా పల్లవిని కూడా బూతులు తిట్టేవాడు. కనీసం పేరు పెట్టి పిలవాడు. ఏమే, ఒసేరు అనేవాడు. ఇలాంటి భాషను పల్లవి జీర్ణించుకోలేకపోయేది. ‘ఇక్కడ ఇలాంటివి మామూలే, మనమే సర్దుకుపోవాలి’ అంటూ అత్త సర్దిచెప్పేది.
ఇలా బూతులు మాట్లాడడం మంచిది కాదని పల్లవి వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నించేది. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఆమె చెప్పిన ప్రతి సారి మరింత ఎక్కువగా తిట్టేవారు. దాంతో వాళ్ళతో మాట్లాడటమే మానేసింది. తన పనేదో తాను చేసుకునేది. కానీ మనసులో మాత్రం కుమిలిపోయేది. దాంతో ఓ రోజు అత్త ‘మీరు ఇలా బూతులు తిడుతుంటే కోడలు చాలా బాధపడుతుంది. తన కోసమైనా కాస్త మీ బూతులు తగ్గించుకోవచ్చు కదా’ అని అడిగింది. దాంతో ‘ఎవరిని చూసుకునే నీకు ఇంత ధైర్యం’ అంటూ విపరీతంగా కొట్టి వర్షం వస్తున్నా పట్టించుకోకుండా ఇంట్లో నుండి నెట్టేశాడు. ఆమె రాత్రంతా బయటే కూర్చుని ఉదయం ఇంట్లోకి వచ్చింది. అప్పటి నుండి ఇక ఆమె నోరు తెరవడమే మానేసింది. కానీ కోడలికి మాత్రం తోడుగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే పల్లవికి ఇద్దరు పిల్లలు పుట్టారు.
నందు ఉద్యోగం చేయడం లేదు. జీతం లేదు. ఇంటి కిరాయిలు 30 వేలు వస్తాయి. వాటిలోనే మొత్తం ఇల్లు చూసుకోవాలి. పిల్లలకు జ్వరం వస్తే ఆస్పత్రికి తీసుకెళ్ళాలన్నా పల్లవి దగ్గర డబ్బు ఉండేది కాదు. ఆమె అన్నలు వచ్చి పిల్లల్ని ఆస్పత్రికి తీసుకుపోయేవారు. చివరకు ఆమె ఫోన్‌ రీచార్జ్‌ కూడా వాళ్ళే చేయించాలి. నందు అస్సలు పట్టించుకోడు. చివరకు అన్నలే నందుకు ఓ ఉద్యోగం ఇప్పించారు. కానీ ఉద్యోగం చేసి వచ్చిన జీతం మొత్తం తాగుడికే ఖర్చు పెట్టేవాడు. దాంతో పల్లవి మరింత కుమిలిపోయేది. చివరకు చనిపోవాలనుకుంది. ‘నేనంటే ఏమీ చదువుకోలేదు. తప్పక ఇక్కడ పడి వుంటున్నాను. నువ్వు బాగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా, అప్పుడు ఎవరిపైనా ఆధారపడాల్సినపని ఉండదు. పిల్లల్ని నేను చూసుకుంటాను’ అంటూ అత్త ఆమెకు ధైర్యం చెప్పింది.
కానీ పల్లవి ఉద్యోగం చేయడానికి మామ ఒప్పకోలేదు. ‘మా ఇంటి కోడలు ఉద్యోగం చేస్తే మాకు ఎంత అవమానం’ అంటూ ఆమెను ఉద్యోగ ప్రయత్నం చేయనీయలేదు. చివరకు పిల్లలు కూడా బూతులు మాట్లాడడం నేర్చుకున్నారు. పల్లవిని అమ్మా అని కాకుండా తాతయ్య, తండ్రి పిలిచినట్టు ఒసేరు, ఏమే అని పిలిచేవారు. పెద్ద పాపకు 5ఏండ్లు నిండాయి. స్కూల్‌కి వెళుతుంది. స్కూల్లో కూడా ఆ పాప బూతులు మాట్లాడుతుందని టీచర్‌ పల్లవిని పిలిచి మందలించింది. దాంతో పల్లవికి బాధ మరింత పెరిగింది. తీవ్రమైన ఒత్తిడికి గురై మానసికంగా కుంగిపోయింది. చివరకు తన పేరు కూడా చెప్పలేని స్థితిలో ఐద్వా అదాలత్‌కు వచ్చింది. ఆమెకు తోడుగా అన్నలు వచ్చారు. ఆమె పరిస్థితి చూసి మేము ముందు పల్లవికి రెండు నెలులు మంచి ఆహారం ఇచ్చి, పూర్తిగా రెస్ట్‌ ఇవ్వమని చెప్పాము.
రెండు నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. మేము నందుని, వాళ్ళ నాన్నను పిలిపించి మాట్లాడితే ‘ఆమెకు మేము బూతులు మాట్లాడడం ఇష్టం లేదు. మాకు మొదటి నుండి ఇలాగే అలవాటు. మా నాన్న మా అమ్మతో ఇలాగే మాట్లాడతాడు. అందుకే నేను నా భార్యను అలాగే పిలుస్తున్నాను. అయినా భార్యను చనువుగా ఏమే, ఒసేరు అని పిలిస్తే తప్పేంటి. ఇక ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు అంటారు. నాకు వచ్చే జీతం నా ఖర్చులకే సరిపోవడం లేదు. ఇక ఇంట్లో ఎలా ఇస్తాను? అయినా ఇంట్లో ఆమెకు ప్రత్యేకంగా ఖర్చులు ఏముంటాయి. పిల్లలకు ఏమైనా అవసరాలుంటే వాళ్ళ మేనమామలు వచ్చి చూసుకుంటారు, ఇక నేనెందుకు ఇవ్వాలి. అయినా మా బంధువులు అందరూ ఇలాగే ఉంటారు. వాళ్ళెవరికీ లేని సమస్య ఈమె ఒక్కదానికే వచ్చిందా’ అన్నాడు.
దాంతో మేము నందు తండ్రిని కూర్చోబెట్టి ‘చిన్నతనం నుండి మీ మాటలు వింటూ పెరిగిన మీ కొడుకు మీలాగే తయారయాడు. భార్యను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీ కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. ఇప్పటి పిల్లలు బాగా చదువుకుని గౌరవంగా బతకాలనుకుంటున్నారు. కానీ మీ వల్ల మీ అబ్బాయి కుటుంబం ముక్కలవుతుంది. చివరకు మీ మనువరాళ్లు కూడా స్కూల్లో బూతులే మాట్లాడుతున్నారంటా. ఇక ఆ పిల్లలు పెరిగిన తర్వాత ఇంకెలా తయారవుతారో ఆలోచించుకోండి. ఇంట్లో భార్య, కోడలు మీకు అలుసుగా కనిపిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ కాపురం ఇక నిలబడదు, మీరే ఆలోచించుకోండి’ అన్నారు. దాంతో అతను ఆలోచనలో పడ్డాడు.
తర్వాత నందుని కూర్చోబెట్టి ‘నువ్వు చదువుకున్నవాడివి. మహిళలను గౌరవించాలి. భార్య అయినంత మాత్రానా ఆమె మనిషి కాదా. నువ్వు నీ తల్లిని కూడా అలాగే మాట్లాడుతున్నావు. నిన్ను నీ భార్య బూతులు తిడితే భరించగలవా? మరి నీపై చనువు నీ భార్యకు కూడా ఉండాలిగా? నీ పిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారంటా స్కూల్లో టీచర్‌ కంప్లెయింట్‌ ఇచ్చారు. నువ్వు మారకపోతే నీ ఇష్టం. నీకంటూ ఓ కుటుంబం లేకుండా పోతుంది. బాగా ఆలోచించుకో. పల్లవిని చూసుకోవడానికి వాళ్ళ అన్నలు ఉన్నారు. ఆమెకు మంచి చదువు ఉంది. ఉద్యోగం చేసుకుంటూ తన బతుకు తాను బతకొచ్చు. కానీ మిమ్మల్ని ఎందుకు భరిస్తుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికైనా మీరు మారకపోతే మీకే కష్టం. ఆమెకు ఇప్పుడు తోడుగా మేము కూడా ఉన్నాము’ అన్నారు. దాంతో నందూ కూడా పరిస్థితి చేయిజారిపోతుందని ఆలోచించాడు. ఇకపై మారతానని మాట ఇచ్చాడు.
పల్లవినీ, నందూనీ మళ్ళీ నెల రోజుల తర్వాత రమ్మనమని పంపించాము. ఇప్పుడు నందులో కొంత మార్పు వచ్చింది. గతంలో మాదిరిగా లేడు. ఉద్యోగం కూడా చక్కగా చేసుకుంటున్నాడని పల్లవి చెప్పింది. ఆమె కూడా చాలా ఉత్సాహంగా కనిపించింది. ‘మేడమ్‌ నేను ఉద్యోగం చేయడానికి ఇంట్లో ఒప్పుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ వల్లనే జరిగింది’ అంటూ సంతోషంగా చెప్పి వెళ్ళిపోయింది.
మహిళలను గౌరవించాలి. భార్య అయినంత మాత్రానా ఆమె మనిషి కాదా. నువ్వు నీ తల్లిని కూడా అలాగే మాట్లాడుతున్నావు. నిన్ను నీ భార్య బూతులు తిడితే భరించగలవా? మరి నీపై చనువు నీ భార్యకు కూడా ఉండాలిగా? నీ పిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారంటా స్కూల్లో టీచర్‌ కంప్లెయింట్‌ ఇచ్చారు. నువ్వు మారకపోతే నీ ఇష్టం.
ఇలా బూతులు మాట్లాడడం మంచిది కాదని పల్లవి వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నించేది. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఆమె చెప్పిన ప్రతి సారి మరింత ఎక్కువగా తిట్టేవారు. దాంతో వాళ్ళతో మాట్లాడటమే మానేసింది. తన పనేదో తాను చేసుకునేది. కానీ మనసులో మాత్రం కుమిలిపోయేది.
– వై.వరలక్ష్మి, 9948794051