ఏకరూపత వర్సెస్‌ సమాన హక్కులు

(నిన్నటి సంచిక తరువాయి)
ఈ నాగాలాండ్‌ ఉదాహరణ దేనిని రుజువు చేస్తుంది? మొదటిది, మహిళా హక్కుల కోసమే ఈ ఏకరూప పౌరస్మృతి అనే ప్రచారం, బీజేపీ సిద్ధాంత కపటత్వాన్ని తెలియజేస్తుంది. ”నాగా బిడ్డలు” డిమాండ్‌ చేసినప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 1/3 వంతు రిజర్వేషన్లను మహిళలకు నిరాకరించడం ద్వారా నాగాలాండ్‌లో మహిళలపై పురుషుల ఏకరూప హక్కుల్ని బీజేపీ అంగీకరించింది. రెండు, నాగాలాండ్‌లో ఆచార చట్టానికి పితృస్వామిక భాష్యాన్ని చెప్పిన మతఛాందసవాదులకు బీజేపీ అండగా నిలిచింది. మూడు, మార్పు కోసం, ముఖ్యంగా మహిళలతో పాటు మహిళా సంఘాలతో సంప్రదింపులు జరపడం అవసరం. కుటుంబ చట్టంతో పాటు గిరిజన వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించే రాజ్యాంగ నిబంధనలకు మద్దతిస్తూ సంస్కరణల ద్వారా సమాజంలోని మహిళలందరికీ సమాన హక్కులు కల్పించే వారికి సీపీఐ(ఎం) మద్దతిస్తుంది. ఆచార చట్టాన్ని రద్దుచేయాలని కాదు, దానిని సంస్కరించాలనేదే వాదన.
వ్యక్తిగత చట్టాల్లో సంస్కరణ
వ్యక్తిగత, ఆచార చట్టాల్లో సంస్కరణలు తక్షణవసరం. నాగాలాండ్‌ విషయంలో చూపిన విధంగా ఎటువంటి సంస్కరణనైనా వ్యతిరేకించే వర్గాల్లో రాజకీయ పలుకుబడి ఉన్న వారిని బీజేపీ, ఆ పార్టీ ప్రభుత్వాలు సమర్థిస్తాయి. ఆఖరికి చర్చికి సంబంధించిన సంస్కరణల విషయంలో కూడా బీజేపీ సాంప్రదాయవాదుల పక్షానే నిలబడుతుంది. ముస్లిం మతానికి సంబంధించిన విషయంలోనే బీజేపీ, ఆ పార్టీ ప్రభుత్వాలు ఆ మతాన్ని చాలా దూకుడుతనంతో లక్ష్యంగా చేసుకుంటాయి. అదేవిధంగా బీజేపీ ఆధిపత్య రాజకీయ చట్రం ఆయా మతాల్లోని సంస్కర్తలను ఆత్మరక్షణలోకి నెట్టి వేస్తుంది. ముస్లిం మతంలోని మత ఛాందసవాదులు సంస్కరణల కోసం ముస్లిం మహిళలు చేస్తున్న డిమాండ్లను నిరాకరించారు. అంతేకాక తమను తాము ముస్లిం మత ప్రతినిధులుగా గుర్తించుకునే రాజకీయ శక్తులు సంస్కరణల అవసరం గూర్చి ఏనాడూ మాట్లాడకపోగా, అసమాన యథాతథస్థితిని బలోపేతం చేసేందుకు బీజేపీ ఆధిపత్యాన్ని ఉపయోగించుకున్నారు. అలాంటి తిరోగమన వైఖరులు, తన లక్ష్యాల ప్రచారంలో బీజేపీకే సహాయపడతాయి. అన్నివర్గాల మహిళలందరికీ సమాన హక్కులు అనే నిజమైన, అత్యవసర సమస్యల నుండి దారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్న విభిన్న ధోరణులను ఎదుర్కోవడం అవసరం. చారిత్రాత్మకంగా, ఇది చాలా వివాదాస్పదమైన సమస్య. ఎందుకంటే ఇది మహిళల అదుపు, కుటుంబంలోని మహిళల అధీనంపైన ఆధారపడి ఉంటుంది. మతఛాందసవాద శక్తులతో ఎలాంటి రాజీ ఉండకూడదు, కానీ సంస్కరణల ప్రక్రియ ముందుకు పోయేందుకు ఆయా సంఘాలతో యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియకు సీపీఐ(ఎం) కట్టుబడి ఉంటుంది. మహిళా వ్యతిరేక సాంప్రదాయాలు, వ్యక్తిగత చట్టంలోని ఆచారాలను అంతం చేయడానికి ముస్లిం మహిళలతోపాటు అన్ని వర్గాల మహిళల డిమాండ్లను సీపీఐ(ఎం) సమర్థిస్తుంది.
గోవా పౌరస్మతి ఉదాహరణ
బీజేపీ, గోవా పౌరస్మృతిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తుంది. ఇటీవల రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరా ఖండ్‌లో ఒక బహిరంగసభలో రాష్ట్రంలో ఏకరూప పౌరస్మృతికి చొరవ చూపినందుకు ముఖ్యమంత్రిని అభినందించాడు. ఆయన ”గోవాలో ఏకరూప పౌరస్మృతి ఉన్నప్పుడు దేశంలోని మిగతా ప్రాంతంలో ఎందుకు ఉండకూడదని” అడిగాడు. ఇలాంటి వాదన చేయడానికి ముందుగా ఆయన వాస్తవాల్ని అధ్యయనం చేయాలి. వాస్తవంగా అలాంటి కోడ్‌ పని చేయదు అనడానికి గోవా సివిల్‌ కోడ్‌ చక్కని ఉదాహరణ. గోవా కోడ్‌లోని కొన్ని అంశాల్లో ఉమ్మడి చట్టాలు వర్తిస్తున్నప్పటికీ, ఇతర అనేక అంశాల్లో అసమానమైన భిన్న సమాజాల కుటుంబ చట్టాల ప్యాకేజిగా ఉంది. ఉదా:- వివాహ రుజువు విషయంలో క్యాథలిక్‌లకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. చర్చిలలో వివాహం చేసుకున్నవారు పౌరచట్టం ప్రకారం విడాకుల నిబంధనల నుండి మినహాయించబడతారు. ముస్లింలు బహుభార్యాత్వపు వివాహాలు చేసుకోకూడదు, కొన్ని పరిస్థితుల్లో హిందూ పురుషులను ద్విభార్యత్వపు వివాహాలు చేసుకోడానికి అనుమతిస్తారు. ఇది గోవా కోడ్‌ లోని ఒక ప్రత్యేక విభాగ మైన ”ద జెంటైల్‌ హిందూ కస్టమ్స్‌ అండ్‌ యూసేజెస్‌ కోడ్‌” ప్రకారం జరుగుతుంది. దీని నిబంధనలు అత్యంత తిరోగమనం. హిందువు అయిన ఒక భార్య తాను 25సంవత్సరాల కంటే ముందు బిడ్డకు జన్మనివ్వడంలో విఫలమైతే, లేదా ఆమె తన 30వ యేటకు ముందే మగబిడ్డకు జన్మనివ్వడంలో విఫలమైతే, అప్పుడు హిందువు అయిన భర్త రెండవ భార్యను వివాహం చేసుకోవచ్చు. ఒక హిందూ మహిళ వ్యభిచారం చేస్తే, విడాకులకు అది కారణం కావచ్చు కానీ, అదే పని హిందూ పురుషుడు చేస్తే అది విడాకులకు కారణం కారాదు. అందుకే బీజేపీ, గోవా కోడ్‌ను ఉదహరిస్తుందా? వారే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఎందుకు ఈ మహిళా వ్యతిరేక నిబంధనలు ఇంకా చట్టాలుగానే మిగిలి ఉంటున్నాయి? అన్ని వర్గాల మహిళలు, వారి సంఘాలు సామాజిక, న్యాయపరమైన సంస్కరణల కోసం నిర్వహించిన సాహసోపేత పోరాటాల ద్వారా సీపీఐ(ఎం) వైఖరి ఏమిటో తెలిసింది. మహిళల సమాన చట్టపరమైన హక్కుల సమస్యను మతతత్వంతో ముడిపెట్టడం, ఏకరూప పౌరస్మృతి పేరుతో సమాజాన్ని విభజించే బీజేపీ చర్యల్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తుంది. అన్ని వర్గాల మహిళలకు సమాన హక్కులు సాధించడమే సీపీఐ(ఎం) ప్రధాన లక్ష్యం. ఏకరూపత సమానత్వంతో సమానం కాదు. పోరాటాన్ని ముందుకు తీసుకొని పోయేందుకు 21వ ”లా కమిషన్‌ నివేదిక” ప్రాతిపదికగా ఉండాలి. ఈ కమిషన్‌ నివేదికను చర్చించడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు తిరస్కరిస్తుందో దేశ ప్రజలకు తెలియజేయాలి. (”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
– బృందాకరత్‌
అనువాదం:బోడపట్ల రవీందర్‌, 9848412451